460 గ్రామాలు మాయం: కేంద్రం షాక్

460 గ్రామాలు మాయం: కేంద్రం షాక్

Updated On : August 24, 2019 / 4:09 AM IST

అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమాలో కోట మాయమైనట్లు ఇక్కడ ఊళ్లే కనిపించకుండాపోయాయి. రెవెన్యూ అధికారుల కంటితో చూస్తే 460గ్రామాలు ఆచూకీ లేకుండా పోయాయట. నిజం ఎంతకాలం దాగుతుంది. జనాభా లెక్కల్లో బండారం బయటపడింది. కేంద్రం 2021 జనాభా లెక్కలకు రంగం సిద్ధం చేసింది. 2011 సెన్సెస్‌ను పరిగణనలోకి తీసుకుంటూ అప్పటి జాబితా ఆధారంగా సర్వే చేయడం మొదలుపెట్టారు. అందులో కొన్ని గ్రామాలు కనిపించకుండా పోవడంతో కేంద్ర జనగణన శాఖ అవాక్కయ్యింది. ఊళ్లు మాయం అయిపోవడమేంటని సీరియస్‌ అయ్యారు. 2011 జనాభా లెక్కల అనంతరం ఏర్పడిన 23 జిల్లాలు కలుపుకొని.. మొత్తం 14 జిల్లాల పరిధిలో 460 గ్రామాలు, 2 మున్సిపాలిటీల పేర్లు గల్లంతయ్యాయి. 

జిల్లాల పునర్విభజన సమయంలో కొన్ని పల్లెల వివరాలు రెవెన్యూ రికార్డుల నుంచి అదృశ్యమయ్యాయి. నిజానికి పల్లెలు అక్కడే ఉన్నప్పటికీ రికార్డుల నుంచి కనిపించకుండాపోవడం కలకలం సృష్టించింది. 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేస్తూ జీఓ 221 నుంచి 250లను జారీ చేసింది. జిల్లా కేంద్రాలుగా ఏర్పడ్డ 2 మున్సిపాలిటీల పేర్లు కూడా కనిపించకుండా పోయాయి. 

58 మండలాల పరిధిలోని 460 గ్రామాలతోపాటు వనపర్తి, గద్వాల మున్సిపాలిటీల సమాచారం కూడా గల్లంతైంది. ఈ విషయాన్ని మార్చిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేసింది. గ్రామాలపై నిర్దారణతో పాటు కొత్తగా ఏర్పాటు అయిన 38 గ్రామాల సమాచారం కావాలని అడిగింది. తేరుకున్న రెవెన్యూ శాఖ గ్రామాల వివరాల గల్లంతుపై దృష్టి సారించింది. జూన్‌లో సీఎస్‌ జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 589 తహసీల్దార్లలో కేవలం 167 మంది, 142 మున్సిపాలిటీల్లో 30 మంది మాత్రమే స్పందించారు.

కేంద్ర జనగణనశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ హెలెన్‌ ప్రేమకుమారి సదరు గ్రామాలను డీనోటిఫై చేశారా?.. కొత్తగా జాబితాలో 38 పంచాయతీలు చేర్చిన వైనాన్ని ప్రశ్నిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించడం గమనార్హం. వాటిని కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో చేరిస్తే ఆ వివరాలు పంపమని కోరారు.