ఆరా ఎగ్జిట్ పోల్..: హుజూర్ నగర్‌లో గెలుపు టీఆర్ఎస్‌దే

తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఇవాళ(అక్టోబర్-21,2019)ఉప ఎన్నిక జరిగింది. ఉత్కంఠభరితంగా పోలింగ్ ముగిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలో ఓటర్లు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారంటోన్నది ఆరా సర్వే.
టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇరు పార్టీలు ధీమాగా ఉన్నప్పటికీ ఆరా సంస్థ చెబుతున్న మాట మాత్రం హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌దే అని. గతంలో అనేకసార్లు ఎన్నికల ఫలితాలపై సర్వే అంచనాలను వెల్లడించిన ఆరా సంస్థ… హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ తాను నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్‌కే పట్టం కడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తుంది.
సర్వే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు 50.48 శాతం, కాంగ్రెస్‌కు 39.95 శాతం, ఇతరులకు 9.57 శాతం ఓట్లు రావొచ్చని సంస్థ అభిప్రాయపడింది. 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు అక్టోబరు 24న జరగనుంది. అంతేగాక, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు, రెండు లోక్ సభ స్థానాలకు కూడా ఇవాళ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.