హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత..
హైదరాబాద్ లో వాహనాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో నగరంలోనూ వాయు నాణ్యత క్షీణిస్తోంది.

Hyderabad Air Pollution (Photo Credit : Google)
Hyderabad Air Pollution : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కాలుష్య కోర్లలో చిక్కుకోకుండా కసరత్తు ప్రారంభించాయి. వాతావరణంలో అనూహ్య మార్పులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆయువు పోస్తున్న వాయువు స్వచ్ఛత కోసం ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఢిల్లీలో రోజురోజుకి వాయు నాణ్యత క్షీణిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ రాకముందే మేల్కోవాలని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.
హైదరాబాద్ లోనూ వాయు కాలుష్యం పెరుగుతోంది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత వారంతో పోలిస్తే వాహనాల సంఖ్య పెరగడం, జనవాసాల్లోకి పారిశ్రామిక కేంద్రాలు రావడంతో పొల్యూషన్ ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరింది. అత్యధికంగా సనత్ నగర్ లో 225 AQI గా నమోదైంది. బొల్లారంలో 121, పటాన్ చెరులో 168, జూపార్క్ ఏరియాలో 166గా నమోదైంది. ఇక ఉదయం 7 గంటల సమయంలో సనత్ నగర్ లో 185, సికింద్రాబాద్ యూఎస్ కాన్సులేట్ లో 183, బహదూర్ పుర 163, పాశమైలారం 166, పటాన్ చెరులో 165గా ఏక్యూఐ నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా చాలా ప్రమాదకర స్థాయిలో వాయు నాణ్యత ఉన్నట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ లో రానున్న రోజుల్లో వాయు కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని 10 ప్రాంతాలకు సంబంధించి చూసుకుంటే.. సనత్ నగర్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రతిరోజు 225గా నమోదవుతోంది. ఇప్పటికే దేశ రాజధానిలో వాయు నాణ్యత రోజురోజుకి క్షీణిస్తున్న పరిస్థితుల్లో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితి ఉంది.
హైదరాబాద్ లో వాహనాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో నగరంలోనూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. గత పదేళ్లతో పోల్చుకుంటే గడిచిన రెండేళ్లుగా హైదరాబాద్ నగరం కూడా ప్రమాద ఘంటికలు మోగించే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. రానున్న రోజుల్లో కాలుష్య తీవ్రతను తగ్గించేలా అడుగులు వేస్తోంది. కర్బన ఉద్గారాల సంఖ్య తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈవీలను (ఎలక్ట్రిక్ వెహికల్స్) ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఏక్యూఐ చెప్పేదేంటి?
* ఏక్యూఐ 0 నుంచి 50 మధ్య ఉంటే గాలి నాణ్యత సంతృప్తికరం
* ఏక్యూఐ 51 నుంచి 100 మధ్య ఉంటే ఆమోదయోగ్యం
* ఏక్యూఐ 101 నుంచి 150 మధ్య ఉంటే సున్నితమైన వారికి అనారోగ్యం
* ఏక్యూఐ 151 నుంచి 200 మధ్య ఉంటే డేంజర్ జోన్
* ఏక్యూఐ 201 నుంచి 300 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయి అధికం
* ఏక్యూఐ 301కి పైగా నమోదైతే అత్యవసర పరిస్థితి
Also Read : ప్రతి ఏటా దాదాపు రూ.5వేల కోట్లు అవసరం.. అసలే ఆర్ధిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి మరో టెన్షన్..!