Singareni Election 2023 : ఏఐటీయూసీకి జైకొట్టిన సింగరేణి ఓటర్లు.. టఫ్ ఫైట్ ఇచ్చిన ఐఎన్టీయూసీ.. ఖాతా తెరవని టీజీబీకేఎస్

హోరాహోరీగా సాగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సత్తా చాటింది. 11 ఏరియాల్లో ఆరు చోట్ల ఐఎన్టీయూసీ, ఐదు చోట్ల ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి.

Singareni Election 2023 : ఏఐటీయూసీకి జైకొట్టిన సింగరేణి ఓటర్లు.. టఫ్ ఫైట్ ఇచ్చిన ఐఎన్టీయూసీ.. ఖాతా తెరవని టీజీబీకేఎస్

AITUC

Updated On : December 28, 2023 / 8:38 AM IST

Singareni Election 2023 Winner AITUC : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఏఐటీయూసీకి గుర్తింపు సంఘంగా సింగరేణి కార్మికులు పట్టంకట్టారు. 10ఏళ్ల తరువాత సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ విజయం సాధించింది. ఐదు రీజియన్లలో ఏఐటీయూసీ విజయం సాధించగా.. ఆరు చోట్ల ఐఎన్టీయూసీ విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలోని నాలుగు డివిజన్లలో ఐఎన్టీయూసీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. నువ్వానేనా అన్నట్లు ఇరు సంఘాలు పోటీపడ్డాయి. గత రెండు దఫాలుగా సింగరేణి గుర్తింపు సంఘంగా కొనసాగిన టీబీజీకేఎస్ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది.

  • హోరాహోరీగా సాగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సత్తా చాటింది. మొత్తం 1983 ఓట్ల మెజార్టీని సాధించి సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. మొత్తం 11 ప్రాంతాల్లో బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ జరిగింది. 39,773 మంది కార్మికులకుగానూ 37,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధిక ఓటర్లు ఏఐటీయూసీకి మద్దతుగా నిలిచారు.
  • సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉన్నాయి. ఆయా ఏరియాల్లో అత్యధికంగా ఓట్లు సాధించిన యూనియన్ ను ప్రాతినిధ్య సంఘంగా గుర్తిస్తారు. పదకొండు ఏరియాల్లో అత్యధికంగా ఓట్లు లభించిన యూనియన్ ను గుర్తింపు సంఘంగా ప్రకటిస్తారు. అయితే, బుధవారం అర్థరాత్రి తరువాత వెల్లడయిన ఫలితాల్లో 11 ఏరియాల్లో ఆరు చోట్ల ఐఎన్టీయూసీ, ఐదు చోట్ల ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని నాలుగు ఏరియాల్లో అన్నింటిలో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. అయితే, అత్యధిక ఓట్లు సాధించిన ఏఐటీయూసీ సంఘం సింగరేణి గుర్తింపు సంఘంగా విజయకేతనం ఎగురవేసింది.
  • గత రెండు దఫాలుగా (2012, 2017 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో) బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీజీబీకేఎస్ (తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం) విజయం సాధించింది. వరుసగా విజయాలు సాధించిన సంఘం బుధవారం జరిగిన ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేక పోయింది. కేవలం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల మధ్యనే నువ్వానేనా అన్నట్లు పోటీ సాగింది.
  • బుధవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 ఏరియాల్లోని 84 పోలింగ్ కేంద్రాల్లో 94.15శాతం పోలింగ్ జరిగింది. రాత్రి 7గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే, పూర్తిస్థాయి ఫలితాలు బుధవారం అర్థరాత్రి తరువాత వచ్చాయి.
  • 1998 నుంచి 2023 సంవత్సరం వరకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఏడు సార్లు జరిగాయి. ఏఐటీయూసీ తాజా విజయంతో నాలుగు సార్లు విజయం సాధించింది. రెండు సార్లు టీజీబీకేఎస్ విజయం సాధించగా.. ఐఎన్టీయూసీ ఒక్కసారి విజయం సాధించింది.
    విజయం సాధించిన సంఘాలు..
    1998- ఏఐటీయూసీ
    2001 – ఏఐటీయూసీ
    2003 – ఐఎన్టీయూసీ
    2007 – ఏఐటీయూసీ
    2012 – టీజీబీకేఎస్
    2017 – టీజీబీకేఎస్
    2023 – ఏఐటీయూసీ
  • బుధవారం జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఏఐటీయూసీకి మొత్తం 3,465 ఓట్లు రాగా.. ఐఎన్టీయూసీకి 1482 ఓట్లు వచ్చాయి.

AITUC గెలిచిన ఏరియాలు..

బెల్లంపల్లి – 122
మందమర్రి – 467
శ్రీరాంపూర్ – 2166
రామగుండం1 – 417
రామగుండం2 – 333
మొత్తం ఓట్లు – 3465

 

INTUC గెలిచిన ఏరియాలు..

సీఓఆర్పీ – 296
కొత్తగూడెం – 233
మణుగూరు – 02
ఇల్లందు – 46
భూపాలపల్లి – 801
రామగుండం3 – 104
INTUC మొత్తం ఓట్లు – 1482

11 ఏరియాల్లో 1983 ఓట్ల మెజార్టీతో ఏఐటీయూసీ సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది.