అమిత్ షా హైదరాబాద్ టూర్ : భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు, రోడ్ షోలు

  • Published By: madhu ,Published On : November 29, 2020 / 06:59 AM IST
అమిత్ షా హైదరాబాద్ టూర్ : భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు, రోడ్ షోలు

Updated On : November 29, 2020 / 8:05 AM IST

Amit Shah Hyderabad Tour : గ్రేటర్‌లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ జాతీయ నేతలతో ప్రచారాన్ని స్పీడ్‌ పెంచింది. 2020, నవంబర్ 28వ తేదీ శనివారం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ప్రచారం నిర్వహించగా… 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు వస్తున్నారు. పాతబస్తీతో పాటు పలుచోట్ల ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. బల్దియా పీఠమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. రోజుకో అస్త్రాన్ని ప్రభుత్వంపై వదులుతూ ప్రచార వేడి రగిలిస్తోంది.



ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలు పలువురు హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు వస్తున్నారు. నేటితో ప్రచారానికి గడువు ముగియనుండడంతో… చివరి అస్త్రంగా అమిత్‌షాను రప్పిస్తోంది. ఉదయం పదిన్నరకు హైదరాబాద్‌కు చేరుకోనున్న అమిత్‌షా.. పదకొండున్నరకు ఓల్డ్‌సిటీ వెళ్తారు. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో రోడ్‌షోలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం నాంపల్లిలో.. ఆ తర్వాత సనత్‌నగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు.



శనివారం కూడా నగరంలో బీజేపీ ప్రచారంతో హోరెత్తించింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ పలుచోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలలో పాల్గొన్న యోగీ…. టీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా విమర్శలు కురిపించారు. పూర్వీకులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడితే…. కేసీఆర్‌ కుటుంబం మళ్లీ నిజాం రూపంలో తెలంగాణ, హైదరాబాద్‌ను దోపిడీ చేస్తోందని విమర్శించారు. గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారుస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ సర్కార్‌ కూలిపోవడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఎలా కూలుతుందో కూడా వివరణ ఇచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బయటివారెవ్వరూ కూల్చబోరని.. పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసే పడగొడతారని జోస్యం చెప్పారు.