Asaduddin Owaisi : నెహ్రూ, సర్దార్ పటేల్ ముస్లింలపై వివక్ష చూపించారు- మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
కేవలం ధనవంతులే ఈ చట్టసభల్లో ఉండేలా బిల్లు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Asaduddin Owaisi

Asaduddin Owaisi (Photo : Google)
Asaduddin Owaisi – Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును లోక్ సభలో లో కూడా ప్రవేశపెట్టారు. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, పార్లమెంటులో ప్రవేశ పెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపుగా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించాయి.
అయితే, అందరి తీరు ఒకలా ఉంటే.. మజ్లిస్ పార్టీ తీరు మరోలా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశించి ఆ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించారు. ఇది యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు అని ఆయన ఆరోపించారు. బీసీలకు న్యాయమైన వాటాను ఈ బిల్లు నిరాకరించిందని ధ్వజమెత్తారు.
కేవలం ధనవంతులే ఈ చట్టసభల్లో ఉండేలా బిల్లు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ రాజ్యాంగ సభలో ముస్లింలపై వివక్ష చూపించారని, వారు నిజాయితీగా ఉంటే ముస్లింలకు మరింత ప్రాతినిధ్యం ఉండేదని అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు అంటూ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఓవైసీ తీరు చర్చకు దారితీసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఓవైసీ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటున్నారు.
దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర పెంచడానికి రూపొందించినదే ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’. చట్టసభల్లో(పార్లమెంటు, అసెంబ్లీలలో) మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం లోక్‌సభలో 542 సీట్లకు గాను.. 78 మంది మహిళా ఎంపీలుంటే.. రాజ్యసభలో 224 సీట్లలో 24 మంది మహిళలున్నారు. ఉభయసభల్లో మొత్తం 102 మంది మహిళా ఎంపీలున్నారు. ఈ లెక్కన చూస్తే.. పార్లమెంటులో 13.3 శాతం మాత్రమే మహిళలున్నారు. ఈ సంఖ్యను 33 శాతానికి పెంచాలనే ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ బిల్లును రూపొందించారు.
ఇది చట్టరూపం దాల్చితే.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు దక్కితే.. ప్రస్తుతం ఉన్న మహిళా ఎంపీల సంఖ్య 181కి పెరుగుతుంది. ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీలు, ఎస్టీల కోసం 131 సీట్లను రిజర్వ్ చేశారు. వీటిల్లో నుంచి సుమారు 43 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు.
ఈ బిల్లు చట్టంగా మారితే.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే, ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటికీ.. 2027 తర్వాత రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రొటేషన్ ప్రక్రియలో రిజర్వ్ సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది.