Amit Shah : ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం- అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Amit Shah On Muslim Reservations : కారు స్టీరింగ్ కేసీఆర్, కవిత, కేటీఆర్ వద్ద కాదు. ఓవైసీ చేతిలో ఉంది. కుటుంబ పార్టీలు దేశానికి, సమాజానికి చేటు చేస్తాయనే విషయాన్ని మీరు గమనించాలి.

Amit Shah On Muslim Reservations
తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ప్రచారంలో స్పీడ్ పెంచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఓటర్లను ఆకట్టుకునేలా వరాల జల్లు కురిపించారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయని అమిత్ షా ఆరోపించారు.
మూడుసార్లు దీపావళి చేసుకుందాం..
ఎస్సీల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఒకసారి దీపావళి జరుపుకున్నారు అన్న అమిత్ షా.. డిసెంబర్ 3న బీజేపీ అధికారంలోకి వచ్చాక మరోసారి దీపావళి చేసుకుందాం అన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభమయ్యాక మూడోసారి దీపావళి చేసుకుందాం అని వ్యాఖ్యానించారు.
ముస్లిం రిజర్వేషన్లు రద్దు, అయోధ్యలో ఉచిత దర్శనం..
”బీజేపీ అధికారంలోకి రాగానే అయోధ్యలో ఉచిత దర్శనం చేయిస్తాం. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ మాతో పోరాడారు. దీంతో ప్రధాని ఇక్కడికే వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పడటంతో తెలంగాణ రైతుల ఆకాంక్షలు నెరవేరాయి. బీజేపీ అధికారంలోకి వస్తే మూతపడిన మూడు చక్కెర పరిశ్రమలను తెరిపిస్తాం. నిజామాబాద్‌లో 500 పడకలతో బీడీ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మాణం చేపడతాం. కేసీఆర్ అమలు చేస్తున్న 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.
Also Read : పెన్షన్ రూ.5వేలకు పెంపు, కొత్త రేషన్ కార్డులు- మంత్రి కేటీఆర్ వరాలు
ఓవైసీ చేతిలో కారు స్టీరింగ్..
ఉపాధి కోసం వలస వెళ్లిన వారి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అరవింద్ పోరాడుతున్నారు. తప్పకుండా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఓవైసీకి భయపడి చేయడం లేదు. కుటుంబ పార్టీలు దేశానికి, సమాజానికి చేటు చేస్తాయనే విషయాన్ని మీరు గమనించాలి. కారు స్టీరింగ్ కేసీఆర్, కవిత, కేటీఆర్ వద్ద కాదు. ఓవైసీ చేతిలో ఉంది. ధర్మపురిని గెలిపించి అతనికి గొప్ప పదవి ఇచ్చే అవకాశం కల్పిస్తారా. బీజేపీ అభ్యర్థులందరిని గెలిపిస్తారా. డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తారా లేదా” అని ఓటర్లను అడిగారు అమిత్ షా.
Also Read : మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం.. హోరాహోరీ ప్రచారం