వాతావరణ మార్పులతో వ్యాధుల దాడి..జాగ్రత్త అంటున్న వైద్యులు

  • Published By: madhu ,Published On : October 30, 2020 / 09:23 AM IST
వాతావరణ మార్పులతో వ్యాధుల దాడి..జాగ్రత్త అంటున్న వైద్యులు

Attack of diseases with climate change : తెలంగాణ రాష్ట్రంలో శీతాకాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే..రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కారణాలు తెలియకుండానే జ్వరాలు వస్తుండడంతో..కరోనా వచ్చిందేమోనన్న భయం ప్రజల్లో నెలకొంటోంది. ఈ కాలంలో కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ..ఇంటా బయట అప్రమత్తంగా ఉండాలంటున్నారు.



కాలానికి అనుగుణంగా వచ్చే సీజనల్ వ్యాధుల తీవ్రత రాష్ట్రంలో పెరిగిపోతోంది. గత సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ 23 నాటితో ఈ ఏడాదిలో ఇదే కాలానికి పోల్చితే ఈ వ్యాధులు తక్కువగా నమోదైనా..గత ఏడు వారాలను పరిశీలిస్తే..వ్యాధుల ఉధృతి క్రమంగా పెరుగుతున్నట్లుగా వారు గుర్తించారు.
కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు, టైఫాయిడ్ వ్యాధులు ప్రబలుతున్నాయని, ఇక దోమకాటుతో వచ్చే డెంగీ, మలేరియా జ్వరాలు సైతం సోకుతున్నాయని వెల్లడిస్తున్నారు. జలుబు, దగ్గు, గొంతినొప్పి, జర్వాలు, శ్వాసకోశ ఇన్ ఫెక్షన్లు సైతం అన్ని వయస్సుల వారిని ఇబ్బందులు పాల్జేస్తున్నాయి.



ప్రస్తుతం అంటువ్యాధులను ఎదుర్కొవాలంటే ప్రజలు పరిశుభ్రతకు పెద్దపీఠ వేయాలని సూచిస్తున్నారు. కరోనా కారణంగా..లాక్ డౌన్ విధించడం..భయంతో ఇంట్లోని ఆహారం తీసుకోవడం, ఇంటా..బయటా శుభ్రతపై దృష్టి పెట్టడం, ప్రభుత్వం ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం కారణంగా..వ్యాధులన్నీ గణనీయంగా తగ్గాయని కొంతమంది అభిప్రాయం. ప్రస్తుతం సీన్ మారిపోయింది.



కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ…పూర్తిస్థాయిలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఎప్పటిలాగానే ప్రజలు సంచరిస్తున్నారు. హోటళ్లు, రోడ్లపై విక్రయించే ఆహారాన్ని భుజిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయంటూ..ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారు. ఇదే అతిపెద్ద ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. భారీ వర్షాలతో వాతావరణం చల్లగా మారిపోవడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయంటున్నారు.



ప్రస్తుతం డెంగీ జ్వరాలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. 2019 జనవరి నుంచి అక్టోబర్ 23 వరకు రాష్ట్రంలో 2 వేల 333 కేసులు నమోదవగా…2020లో ఇదే కాలానికి 1717గా నిర్ధారించారు. ఇందులో గత 7 వారాల్లోనే 513 కొత్త కేసులు రికార్డవడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా వైరస్ తో పాటు..డెంగీ సైతం విజృంభిస్తే..ప్రజారోగ్యం ఛిన్నాభిన్నమవుతుందనే భయాందోళనలు రేగుతున్నాయి. రాష్ట్రంలో మలేరియా ప్రభావిత గ్రామాలు సుమారు 1000 వరకు ఉండగా, డెంగీ కేసులు ఎక్కువగా ఉన్నవి దానికి రెట్టింపని వైద్య వర్గాలు వెల్లడిస్తున్నాయి.



శ్వాసకోశ సమస్యలు అధికమౌతున్నాయి. రాష్ట్రంలో గత సంవత్సరం జనవరి – అక్టోబర్ 23 మధ్య 5,22,828 మంది బాధితులు చికిత్స పొందారు. ఈ ఏడాది ఇదే కాలానికి 2,08,435 మంది శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ల బారిన పడ్డారని అంచనా. గత 53 రోజుల్లోనే 30,433 కేసులు నమోదయ్యాయి. గత ఏడు వారాల్లో కొత్తగా 32 వేల 479 మంది వీటితో చికిత్స పొందారు.



అపరిశుభ్రమైన చేతులతో తినడం, తాగడం, ఆహారం, నీళ్లు కలుషితం కావడం తదితర కారణాలతో నీళ్ల విరేచనాలు వస్తుంటాయి. 2019 జనవరి నుంచి అక్టోబర్ 23 నాటికి డయేరియా, గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో 3,29,262 మంది చికిత్స పొందుతుండగా 2020లో ఇదే సమయానికి 1,22,102 మంది ప్రభుత్వ వైద్యంలో సేవలు పొందారు.