బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్

AV Subbareddy arrested in BoinPally kidnapping case : హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 ముద్దాయి ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్ అయ్యారు. మాదాపూర్‌లో ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని… తనతో ఆధారాలు ఉన్నాయని తెలిపారు సుబ్బారెడ్డి. పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పారు. కిడ్నాప్ కేసులో తాను ఏ1 కాదన్నారు. అనుమానంతోనే తన పేరును ఏ1గా చేర్చారని తెలిపారు. తనకు సంబంధం లేని విషయంలో ఏ1గా చేర్చారని చెప్పారు. దర్యాప్తులో తన పేరును తొలగిస్తారని పేర్కొన్నారు.
హఫీజ్‌పేట్ భూ వ్యవహారమంతా తనకు తెలుసన్నారు ఏవీ సుబ్బారెడ్డి. కేసు విచారణ దశలో ఉండగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. అఖిలప్రియ, భార్గవ్‌రామ్ పాత్రపై అన్ని వివరాలు తనకు తెలుసని, సమయం వచ్చినప్పుడు ఆధారాలతో బయటపెడతానన్నారు. అఖిలప్రియ, భార్గవ్‌రామ్ వ్యవహారశైలిపై గతంలోనే హెచ్చరించానని తెలిపారు ఏవీ సుబ్బారెడ్డి. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.
బోయినపల్లి కిడ్నాప్ కేసును పోలీసులు మూడు గంటల్లోనే చేధించారు. నిన్న రాత్రి మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు ఆయన సోదరులు సునీల్, నవీన్‌లు కిడ్నాప్‌కు గురయ్యారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి కేసును చేధించారు. కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఏ3గా భార్గవ్‌రామ్ ఉన్నారు.
ఏ1, ఏ2 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఏ3 నిందితుడు, అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్‌పై పోలీసుల దర్యాప్తు ప్రారంభం కాగానే భార్గవ్‌రామ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆచూకీ కోసం సీసీ కెమెరా ఫుటేజీల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.