జూబ్లీహిల్స్ టికెట్ ఫైట్.. తానే అభ్యర్థినన్న అజారుద్దీన్.. రేసులోకి ఈ నేతలు.. గెలిస్తే గ్రేటర్ కోటాలో మంత్రి కావచ్చన్న ప్లాన్
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు బొంతు రామ్మోహనే ఆప్షన్ గా కన్పిస్తున్నారనే టాక్ నడుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ రేసు కాక రేపుతోంది. ఆశావహులు నువ్వానేనా అన్నట్లుగా ఎవరికి వారు పైరవీలు చేస్తున్నారు. రోజుకో కొత్త నేత పేరు ప్రచారంలోకి వస్తుండటంతో కోల్డ్ వార్ పీక్ లెవల్‌కు చేరుకుంటుంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ క్యాండిడేట్‌గా పోటీ చేసి ఓడిన అజారుద్దీన్… ఈసారి కూడా తానే అభ్యర్థనని ప్రకటించేసుకున్నారు.
వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుందని..అదంతా నిజం కాదని.. బైపోల్ లోనూ తానే బరిలోకి దిగుతానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. అజారుద్దీన్ కామెంట్స్‌పై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ రియాక్ట్ కావడంతో హస్తంలో టికెట్ ఫైట్ హాట్ టాపిక్‌గా మారింది. అభ్యర్థి ఎవరనేది ఇంకా డిసైడ్ చేయలేదు..ఎవరు పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుందంటూ అజారుద్దీన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్.
ఒక్క అజారుద్దీనే కాదే..జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో అరడజను మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే పక్కాగా గెలుస్తామన్న ధీమా ఒకటైతే.. వచ్చే ఎన్నికలకు తమకంటూ ఓ నియోజకవర్గం ఉండిపోతుందని స్కెచ్ వేస్తున్నారట లీడర్లు. పైగా గ్రేటర్ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో జూబ్లీహిల్స్‌లో గెలిస్తే అమాత్యయోగం దక్కొచ్చన్న ప్లాన్ ఉందట. ఈ ఈక్వేషన్స్‌తోనే కాంగ్రెస్ టికెట్ కోసం ఐదారు మంది నేతలు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసిన అజారుద్దీన్‌తో పాటు ఫిరోజ్ ఖాన్, ఫహీమ్ ఖురేషి, నవీన్ యాదవ్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఇప్పటివరకు టికెట్ రేసులో ప్రధానంగా కన్పించారు.
Also Read: రద్దీకి చెక్.. కాకినాడ-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
ఇక తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు రేసులోకి వచ్చింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికి చేరిన ఆయన..సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించారు. వివిధ కారణాలు, ఈక్వేషన్స్‌తో అప్పుడు ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే తనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే గ్రేటర్ మేయర్‌గా పనిచేసిన పరిచయాలతో ఈజీగా గెలుస్తానన్న ధీమాలో ఉన్నారట బొంతు. సామాజిక సమీకరణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని బొంతు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట.
బొంతు రామ్మోహన్..సామాజిక వర్గం మున్నూరు కాపు కాగా..ఆయన భార్య శ్రీదేవి యాదవ సామాజిక వర్గం. బొంతు రామ్మోహన్ గతంలో గ్రేటర్ మేయర్ గా పనిచేయగా…ఆయన భార్య శ్రీదేవి ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్నారు. ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలువురు కార్పొరేటర్లతో పాటు.. బీఆర్ ఎస్ కేడర్ తోనూ బొంతుకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో అవి కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటూ టిక్కెట్ రేసులోకి వచ్చారు బొంతు రామ్మోహన్. పైగా తనకు టికెట్ ఇస్తే..జూబ్లీహిల్స్‌లో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్న ఎంఐఎం సహకరిస్తుందని కూడా చెప్తున్నారట బొంతు.
ముస్లిం మైనార్టీల ఓట్లే కీలకం
జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో ముస్లిం మైనార్టీల ఓట్లే కీలకం. మూడు లక్షల 75 వేల ఓట్లు ఉన్న నియోజకవర్గంలో లక్ష ఇరవై ఐదు వేల ఓట్లు ముస్లింలవే. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతగా అజారుద్దీన్‌ను బరిలో దించింది. గతంలో పోటీ చేసిన నేపథ్యంలో ఈసారి కూడా తనకే అవకాశం ఇవ్వాలంటూ అజారుద్దీన్ తెరపైకి వచ్చారు. మైనారిటీ నేతల నుంచి మరో నేత ఫిరోజ్ ఖాన్ కూడా పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
అలాగే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి కూడా టికెట్ రేసులో ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్‌లో గెలవాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి. కాంగ్రెస్ మైనార్టీ అభ్యర్థిని బరిలో దింపితే ఎంఐఎం మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు. కాంగ్రెస్ నుంచి ముస్లిం, మైనార్టీ లీడర్‌కు టికెట్ ఇస్తే తాము పోటీ చేస్తామని ఎంఐఎం చెప్తోందట.
గ్రేటర్‌లో తమ పార్టీ నుంచి తప్ప ఏ పార్టీ నుంచి మైనార్టీ నేత ఎదుగకుండా చూడటమే ఎంఐయం వ్యూహంగా కన్పిస్తోంది. అందుకే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ మైనార్టీ నేతకు ఇస్తామంటే మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదంటోందట ఎంఐఎం. దీంతో ఈసారి జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మైనార్టీ కి అవకాశం దక్కకపోవచ్చనే టాక్ నడుస్తోంది. రానున్న గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని ఎంఐయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అభ్యర్థికే కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాలనే యోచన జరుగుతోందట
కాంగ్రెస్ నుంచి రేసులో ఉన్న మరో నేత నవీన్ యాదవ్. హైదరాబాద్ లోకల్ యాదవ సామాజిక వర్గం కావడంతో..టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన తండ్రి దివంగత పీజేఆర్ లెగసి ఉన్నందున తనకు టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తానని ఆమె చెప్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన విజయారెడ్డి..ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి రావడంతో..జూబ్లీహిల్స్ వైపు దృష్టిపెట్టారు విజయారెడ్డి.
అయితే నవీన్ యాదవ్‌కు ఫాలోయింగ్ బానే ఉన్నా గెలిచేంత బలం లేదన్న కాంగ్రెస్ పెద్దల అంచనా అంటున్నారు. ఇక విజయారెడ్డికి ఖైరతాబాద్‌లో ఉన్నంత పట్టు జూబ్లీహిల్స్‌లో లేదంటున్నారు. మైనార్టీ నేతలకు టికెట్ ఇస్తా అంటే ఎంఐఎం ఒప్పుకోదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు బొంతు రామ్మోహనే ఆప్షన్ గా కన్పిస్తున్నారనే టాక్ నడుస్తోంది. విజయా రెడ్డి, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ లో ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తుందో వారే జూబ్లీహిల్స్ బరిలో దిగడం ఖాయమని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ఎంఐఎంను ఎవరు ప్రసన్నం చేసుకుంటారో.. టిక్కెట్ కొట్టేస్తారో చూడాలి మరి.