కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి సవాల్..
అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay
Bandi Sanjay : అధికార కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరిక సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ పరిధిలోని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయంగా కేసీఆరే సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి పంపుతున్నారంటూ సంజయ్ ఆరోపించారు. అవినీతి నుంచి బయటపడేందుకు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నాడని సంజయ్ అన్నారు.
Also Read : త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం: దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
సెక్యూరిటీ లేకుండా రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని బండి సంజయ్ సవాల్ చేశారు. నిరుద్యోగులను పోలీసుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేస్తోందని అన్నారు. రాహుల్ గాంధీని సొంత పార్టీ వారే ప్రధాని అభ్యర్థిగా అంగీకరించలేదని సంజయ్ వ్యాఖ్యానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని, బీజేపీ కార్యకర్తల గెలుపే రాష్ట్ర బీజేపీ నాయకత్వం లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో తెలంగాణ ప్రజలు మోసపోయారు. కాంగ్రెస్ ను ప్రజలు వ్యతిరేకించారనటానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిదర్శనం అని సంజయ్ తెలిపారు.
Also Read : ఆ క్రెడిట్ మొత్తం జగన్‌దే.. చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు : మాజీ మంత్రి అమర్నాథ్
తెలంగాణ ప్రజాప్రతినిధులుసైతం ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే గ్యారంటీ అంటున్నారు. ధర్మం, తెలంగాణ పేదల కోసం పోరాడేది బీజేపీ మాత్రమే. బీజేపీ కార్యకర్తల పోరాటం వలనే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి. రైతులను మోసంచేసే విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.