తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు

ఐదు అమలు చేశామని రేవంత్, ఆరు అమలయ్యాయని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇద్దరూ తోడు దొంగల్లా రాష్ట్ర ప్రజలను బురుడి కొట్టిస్తున్నారు.

తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు

Harish Rao demands Rahul Gandhi Apology: నిర్మల్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అబద్దాలు మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి, తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీల అమలుపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అబద్దాలడటమే కాకుండా రాహుల్ గాంధీతో కూడా అబద్ధం ఆడించారని, ఇది సిగ్గుచేటైన విషయమని విమర్శించారు. రాహుల్ తన స్థాయిని కాపాడుకోవాలంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

”ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సభలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు హామీలు అమలు చేస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పడం దారుణం. ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ. రాహుల్ అబద్ధాలు ఆడుతుంటే రేవంత్ రెడ్డి చప్పట్లు కొడుతున్నారు. మహిళలకి 2,500 వేస్తున్నట్లు చెప్పడం వారిని అవమానించడమే. రాహుల్, రేవంత్ ఇద్దరు కలసి అబద్దాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారా? ఇద్దరు తోడు దొంగల్లా రాష్ట్ర ప్రజలను బురుడి కొట్టిస్తున్నారు. కాంగ్రెస్ ఆరు గారెంటీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సోనియా, ప్రియాంక, రాహుల్ అందరు కూడా రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు భాధ్యత తమదన్నారు. రాహుల్ మాటలు వింటుంటే రాజు గారి దేవతా వస్త్రాల కథ గుర్తుకువస్తోంది. ఇక్కడ జరుగుతున్న దాన్ని సరి చేయాల్సింది పోయి.. సమర్డించుకోవడం సిగ్గుచేటు.

కర్ణాటకలో ఐదని, తెలంగాణలో ఆరు గ్యారంటీలని మోసం చేస్తున్నారు. అమలు కాని హామీలు అమలవుతున్నాయని చెప్పిన రాహుల్ తక్షణమే భేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మోదీ నల్లదనం తెస్తానని మోసం చేశారు.. రాహుల్ ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేశారు. రాహుల్ చెప్పినట్లు డబ్బులు పడకుంటే కాంగ్రెస్ నేతలను మహిళలు నిలదీయాలి. కాంగ్రెస్ హామీల్లో ఒక్కటి తప్ప ఏదీ అమలు కాలేదు. ఐదు అమలు చేశామని రేవంత్, ఆరు అమలయ్యాయని రాహుల్ అంటున్నారు. ఇంతకంటే భావదారిద్ర్యం మరోటి లేదు.. ఇది చిల్లర, చిచోర రాజకీయం. ఒక్కటే అమలు అయిందని నేను అంటున్నా, అన్ని అమలు అయ్యాయని మీరు అంటున్నారు.. మీ హామీల అమలుపై బహిరంగ చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా? చర్చకు రాహుల్ గాంధీ వస్తారా, రేవంత్ రెడ్డి వస్తారా తేల్చుకోవాలి.

Also Read: నేను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? అదో పనికిమాలిన స్కీమ్, ఆడోళ్లు తన్నుకుంటున్నారు- కేసీఆర్

కాంగ్రెస్ అంటేనే కపట నీతి, మోసం, దగా అని తేలిపోయింది. పట్టపగలు తెలంగాణలో పచ్చి అబద్ధాలు చెప్పారు రాహుల్. నేతి బిరకాయలో నెయ్యి ఎంతో రాహుల్ మాటల్లో నిజం అంతే ఉంది. తాము అధికారంలోకి వస్తే పేదరికాన్ని పారద్రోలుతామంటున్న కాంగ్రెస్ దేశంలో అతి ఎక్కువ ఏళ్లు పాలించింది మీరే కదా? దేశంలో పేదరికానికి, ఆకలికి కారణం మీరు కాదా? దేశం వెనకబాటుకు మీరే కారణం. దేశంలో పేదరికానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే, రెండో ముద్దాయి బీజేపీ. రాహుల్ తన స్థాయిని కాపాడుకోవాలంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల”ని హరీశ్ రావు అన్నారు.

Also Read: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష : రాహుల్ గాంధీ