లోక్‌స‌భ‌ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 2 చేస్తున్నారు: కేటీఆర్

పార్లమెంట్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 2 చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

లోక్‌స‌భ‌ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 2 చేస్తున్నారు: కేటీఆర్

KTR: లోక్‌స‌భ‌ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి కొత్త మోసం మొదలపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మోసం పార్ట్ 1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేశారని, ఇప్పుడు రుణమాఫీ ఆగస్ట్ 15 నాడు చేస్తానంటూ పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ 2 చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అలంపూర్ చౌరస్తాలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అలంపూర్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 420 హామీలు ఇచ్చి గద్దె నెక్కిన కాంగ్రెస్ మాట తప్పిందని.. రైతు బంధు లేదు, పంట బోనస్ రావడం లేదన్నారు. మొగాడివైతే రెండు లక్షల రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చమని పదేళ్ల నుంచి అడుగుతున్నా కేంద్రం స్పందించడం లేదని వాపోయారు.

కేసీఆర్ ద్వారా పదవులు పొందిన అందరూ పార్టీని వదిలి వెళ్తుంటే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం బీఆర్ఎస్ లోకి వచ్చారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఆహ్వానించినా తిరస్కరించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ పార్టీలోకి వచ్చారని, అధికారం కాదని వచ్చిన ధైర్యవంతుడని ప్రశంసించారు. నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిస్తే ప్రవీణ్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేస్తారని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని.. ఎంపీగా ఆయన గెలిస్తే తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్న నియోజకవర్గంగా అలంపూర్ నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే.. ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్నారు.

Also Read: బీఆర్ఎస్‌ గురించి కుండబద్దలు కొట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలు: మంత్రి కోమటిరెడ్డి

హక్కుల కోసం పోరాడతా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
”అలంపూర్ గడ్డకు చెందిన నేను ఇక్కడి ప్రాంత ప్రజలకు సుపరిచితుడిని. 26 యేండ్ల పోలీస్ సర్వీస్ తరువాత రాజకీయాల్లోకి వచ్చాను. నేను పార్లమెంట్ కి పోతే నాగర్ కర్నూల్ ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడుతాను. ఎమ్మెల్యే విజయుడు, చల్లా గారితో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేస్తాను. నన్ను పార్లమెంట్ కి పంపించే బాధ్యత మీపై వున్నద”ని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.