ఇప్పటివరకు బీఆర్ఎస్‌ను వీడిన కీలక నేతలు వీరే.. ఇంకా ఏం జరుగుతోందో తెలుసా?

BRS: పార్టీ మీద అవినీతి, ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందని కారణం చెప్తూ కాంగ్రెస్‌ గూటికి..

ఇప్పటివరకు బీఆర్ఎస్‌ను వీడిన కీలక నేతలు వీరే.. ఇంకా ఏం జరుగుతోందో తెలుసా?

BRS

లోక్‌సభ ఎన్నికల వేళ ఒక్కో బీఆర్ఎస్ నేత పార్టీని వీడుతుండటం అటు క్యాడర్‌ను.. ఇటు లీడర్లను నిరాశ పరుస్తోంది. పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు ఎంపీలుగా, మంత్రులుగా పదవులు అనుభవించి.. కేసీఆర్, కేటీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తిన నేతలంతా ఇప్పుడు పలాయనం బాట పట్టారు. ఒక్కొక్కరుగా కండువాలు మారుస్తున్నారు. ఏమైనా అడిగితే అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్తున్నామని చెబుతున్నారు. పనిలో పనిగా గులాబీ బాస్ కేసీఆర్‌తో పాటు అతని ఫ్యామిలీపై విమర్శలు చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. సిట్టింగ్‌ ఎంపీలు వెంకటేష్ నేత, బీబీ పాటిల్, రాములు, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్ కారు దిగి జాతీయ పార్టీల్లోకి వెళ్లారు. దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్‌ బరిలో నిలుస్తున్నారు. మాజీ ఎంపీలు నగేశ్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, తాటికొండ రాజయ్య కూడా జంప్ అయ్యారు. బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దిన్, డిప్యూటీ మేయర్ శ్రీలత దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది.

పార్టీ అన్ని విధాలుగా గౌరవించినా..
పార్టీలో నెంబర్.2గా కొనసాగిన కే. కేశవరావు కేసీఆర్‌కు హ్యాండిచ్చారు. రెండుసార్లు రాజ్యసభకు నామినేట్ అవడమే కాదు.. కూతురును బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్‌గా నిలబెట్టి GHMC మేయర్‌ను చేసుకున్నారు కేకే. పార్టీ అన్ని విధాలుగా ఆయనను గౌరవించినా చివరకు గులాబీబాస్‌కు చెప్పి మరీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు కేకే. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కూతురు గద్వాల విజయలక్ష్మీతో కలసి శనివారం నాడు కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు కేకే.

ఇక కేసీఆర్ అవినీతిపరుడు అంటే తాను ఒప్పుకోనంటున్నారు కేకే. జేబులో ఉన్న చివరిపైసా కూడా పక్కోడికి ఇచ్చే రకమని చెప్పారు. కేసీఆర్ చేసినంత అభివృద్ధి దేశంలో ఎవరూ చేయలేదన్నారు కేకే. పనిచేసేవాడు అన్నీ సహించినా ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం ఊరుకోడని చెప్పుకొచ్చారు కేకే.

కడియం శ్రీహరి ఫ్యామిలీ
మరోవైపు మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్యామిలీ బీఆర్‌ఎస్ పార్టీకి షాకిచ్చింది. పట్టుబట్టి తన కూతురు కావ్యకు టికెట్ ఇప్పించుకున్న కడియం శ్రీహరి.. తీరా టికెట్ అనౌన్స్ చేశాక.. ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు. పార్టీ మీద అవినీతి, ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందని కారణం చెప్తూ కాంగ్రెస్‌ గూటికి చేరారు. వాస్తవానికి కడియం కావ్యకు టికెట్ ఇస్తున్నారనే ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ ఇద్దరు బీఆర్ఎస్‌ను వీడారు. అయినా కడియం కూతురుకు పెద్దపీట వేశారు గులాబీ బాస్. దాన్ని నిలబెట్టుకోకుండా ఉన్నఫలంగా కారు దిగి హస్తంతో షేక్ హ్యాండ్ ఇచ్చింది కడియం ఫ్యామిలీ.

మినిస్టర్ క్వాటర్స్‌లో కడియం శ్రీహరి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, కాంగ్రెస్‌ నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం నాడు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు కడియం శ్రీహరి, అతని కూతురు.

నేతల జంపింగ్స్‌పై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేకే, కడియం లాంటి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయేవాళ్లు ఎలాగు రాళ్లు వేసి వెళ్తారని వాటిని పట్టించుకోవద్దని క్యాడర్‌కు సూచించారు. రంజిత్‌రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిని మళ్లీ బీఆర్ఎస్‌లో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్.

కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని వీడినా నష్టమేమి లేదన్నారు మాజీమంత్రి హరీశ్‌రావు. బీఆర్ఎస్ పార్టీకి ఇదేం కొత్తకాదన్నారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనన్నారు హరీశ్. వెళ్లినవారిని కాళ్ళు మొక్కినా మళ్ళీ తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందన్నారు.

కడియం శ్రీహరి పార్టీ మార్పుపై తీవ్రస్థాయిలో స్పందించారు ఓరుగల్లు బీఆర్ఎస్ నేతలు. ఎంతోమంది నిబద్దత గల నాయకులను కడియం తొక్కేశారని మండిపడ్డారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారడానికి కడియమే కారణమని ఆరోపించారు. విలువల గురించి మాట్లాడే శ్రీహరికి విలువలే ఉంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు.

Also Read: ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది.. అది ముగియగానే..: రేవంత్ రెడ్డి