Padi Kaushik Reddy: బెయిల్ పై బయటకొచ్చిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
బెయిల్ మంజూరు కావడంతో స్టేషన్ నుంచి కౌశిక్ రెడ్డి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు.

Padi Kaushik Reddy
Padi Kaushik Reddy: కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం రాత్రి 10టీవీ కార్యాలయంలో ఇంటర్వ్యూలో పాల్గొని బయటకొచ్చిన సమయంలో కరీంనగర్ నుంచి వచ్చిన పోలీసులు ఆయన్ను అదపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నేరుగా కౌశిక్ రెడ్డిని కరీంనగర్ కు తరలించారు. అర్థరాత్రి సమయంలో కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు కౌశిక్ రెడ్డిని తీసుకెళ్లారు. స్టేషన్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రంతా కౌశిక్ రెడ్డి స్టేషన్ లోనే ఉన్నారు.
Also Read: Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు
మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్ లోనే కౌశిక్ రెడ్డికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9గంటల సమయంలో పోలీస్ స్టేషన్ నుంచి భారీ బందోబస్తు మధ్య కరీంనగర్ లోని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపర్చారు. గంటపాటు ఇరు వర్గాల న్యాయవాదులు జడ్జి ఎదుట వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నందున రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు విపించగా.. కౌశిక్ రెడ్డిపై నమోదైన అన్ని సెక్షన్లు బెయిలబుల్ కాబట్టి రిమాండ్ ను కొట్టివేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. గంటపాటు ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం.. బీఆర్ఎస్ లీగల్ టీం వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. మూడు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. గురువారం లోగా రెండు లక్షల రూపాయలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. అయితే, పోలీసులు విచారణ నిమిత్తం పిలిచిన సమయంలో హాజరు కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో స్టేషన్ నుంచి కౌశిక్ రెడ్డి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ముందుగా తెలంగాణ ప్రజలకు, హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నిన్నటి నుంచి తెలంగాణలో హైడ్రామా జరిగిందన్నారు. నన్ను అరెస్టు చేసిన సమయం నుంచి నాకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, కవితతోపాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు చేతులు జోడించి శిరస్సు వంచి ధన్యావాదాలు తెలియజేస్తున్నానని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఇవాళ సంక్రాంతి పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దని అనుకుంటున్నానని, దీనికితోడు కరీంనగర్ టౌన్ లో మీడియా సమావేశం పెట్టొద్దని కోర్టు సూచించిందని చెప్పారు. రేపు హైదరాబాద్ లో మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలపై మాట్లాడతానని కౌశిక్ రెడ్డి తెలిపారు.
ఉదయం కరీంనగర్ త్రీటౌన్ నుంచి జడ్జి వద్దకు తరలించే క్రమంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడతామని చెప్పాడు. పండగ వేళ అరెస్టు చేసి ఇంట్లో లేకుండా చేశారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కు తగ్గనని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూనే ఉంటానని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.