కాంగ్రెస్ గూటికి కేకే.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. పార్టీలో చేరిక తేదీపై చర్చ

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

కాంగ్రెస్ గూటికి కేకే.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. పార్టీలో చేరిక తేదీపై చర్చ

BRS senior leader Kesava Rao

BRS Senior Leader Kesava Rao : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రేవంత్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై రేవంత్ తో కేకే చర్చించినట్లు తెలిసింది. రేపు లేదా ఏప్రిల్ 6న కేశవరావు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. తొలుత రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కేశవరావు పేర్కొన్నప్పటికీ.. ఏప్రిల్ 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలు హాజరు కానున్నారు. ఇరువురి సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.

Also Read : ఖాళీ అవుతున్న కారు.. కాంగ్రెస్‌లోకి వలసల జోరు

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కే. కేశవరావు ఇప్పటికే పేర్కొన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనూ ఆయన గురువారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కేసీఆర్ కు కేశరావు చెప్పినట్లు సమాచారం. కేకే కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 30న ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. కేశవరావు, విజయలక్ష్మీ ఇద్దరూ కలిసి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరకుంటే ఏప్రిల్ 6న కాంగ్రెస్ పార్టీ జన జాతర సభలో రాహుల్, ఖర్గే సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నాట్లు కాంగ్రెస్ వర్గాల పేర్కొంటున్నాయి.

Also Read : పార్టీ మారుతున్న నేతలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్.. రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్పారంటూ..

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో పాటు ద్వితీయస్థాయి నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత దగ్గరి వ్యక్తులుగా పేరున్న కే. కేశవరావు, ఆయన కుమార్తె, మేయర్ గద్వాల విజయలక్ష్మీతో పాటు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇవాళ సాయంత్రం వరకు సీఎం రేవంత్ రెడ్డితో కడియం, ఆయన కుమార్తె కావ్య భేటీ అవుతారని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ అధిష్టానం కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం లేఖ ద్వారా తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.