పార్టీ మారుతున్న నేతలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్.. రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్పారంటూ..

తమ పార్టీని వీడుతున్న నాయకులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

పార్టీ మారుతున్న నేతలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్.. రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్పారంటూ..

KTR Tweet: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా సీనియర్ నేతలు కేశవరావు, కడియం శ్రీహరి కూడా కారు పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు. కేశవరావు కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కడియం శ్రీహరి కుమార్తె కావ్య కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. కాగా, పార్టీని వీడుతున్న నాయకులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఎంతమంది పార్టీని వీడినా బెదరబోమని, కొత్త నాయకత్వం తయారు చేస్తామని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేసి పోరాట పంథాలో కదం తొక్కుతామని అన్నారు. ద్రోహపు ఎత్తుగడలతో తమను ఆపలేరని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొగల సత్తా తమ పార్టీకి ఉందని బీఆర్ఎస్ శ్రేణులకు భరోసాయిచ్చారు.

Also Read: కాంగ్రెస్ గూటికి కేకే.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. పార్టీలో చేరిక తేదీపై చర్చ

కాగా, మరోవైపు కేశవరావు ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై సీఎం రేవంత్ తో ఆయన చర్చిస్తున్నట్టు సమాచారం. తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కేశవరావు విప్లవ్ కుమార్ స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీని వీడడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.