Public meeting: ఓరుగల్లు టు ఘట్‌కేసర్.. బీఆర్ఎస్ సభా వేదిక మార్పు? ఎందుకంటే?

అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడం, పార్టీ సిల్వర్ జూబ్లీ సభ అవ్వడం, అందులోనూ కేసీఆర్ హాజరయ్యే సభ కావడంతో గ్రాండ్ సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఉందట గులాబీ పార్టీ.

Public meeting: ఓరుగల్లు టు ఘట్‌కేసర్.. బీఆర్ఎస్ సభా వేదిక మార్పు? ఎందుకంటే?

Updated On : March 27, 2025 / 4:43 PM IST

ముందుగా ప్రకటించిన ప్రకారం ఓరుగల్లులోనే సభ పెడుదామా? లేదంటే మరోచోటకు మార్చుదామా? బహిరంగ సభ సక్సెస్ కావాలంటే ఎక్కడ సభ పెడితే బాగుంటుందన్న దానిపై చర్చోపచర్చలు చేస్తోందట బీఆర్ఎస్. పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ పెట్టాలని డిసైడ్ చేసింది గులాబీ నాయకత్వం.

అందుకు అనుగుణంగా పార్టీ ముఖ్యనేతలు హరీశ్‌రావు, పల్లారాజేశ్వర్‌రెడ్డితో పాటు ఓరుగల్లు నేతలంతా బహిరంగ సభ కోసం స్థలాలను పరిశీలించారు. వరంగల్ చుట్టు పక్కల ఎక్కడ ఎక్కువ స్థలం ఉంది..సభా స్థలం, పార్కింగ్ ప్లేస్‌ అంతా సెట్ అవుతుందా లేదా అని ఆరా తీశారు.

బహిరంగ సభకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు అందుకు సంబందించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. మీటింగ్‌ ఏర్పాట్లు స్పీడప్‌ చేయాలనుకున్న క్రమంలోనే గులాబీ అధిష్టానం పునరాలోచనలో పడ్డట్లు చర్చ జరుగుతోంది. ఉద్యమ కాలంలో, తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎన్నో బహిరంగ సభలు నిర్వహించింది.

కనీవినీ ఎరుగని రీతిలో లక్షల మందితో సభలు, సమావేశాలు ఆర్గనైజ్ చేసింది. ఎప్పుడు ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా లక్షలాదిమంది తమ సభలకు తరలివస్తారనే ధీమా ఆ పార్టీలో కనిపించేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రతిపక్షంలోకి వచ్చాక నిర్వహించాలనుకుంటున్న సభ విషయంలో మాత్రం కొంత ఆందోళన కనిపిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

వరంగల్‌లో ఎన్నో సభలు
ఇదే వరంగల్‌లో ఉద్యమ కాలం నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సభలు పెట్టింది బీఆర్ఎస్. అదే తరహాలో పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఓరుగల్లు వేదికగా భారీ పెట్టాలని అనుకున్నప్పటికీ బీఆర్ఎస్ నేతలకు కొంత సందేహం కలుగుతోందనే టాక్ వినిపిస్తోంది.

వరంగల్‌లో సభ నిర్వహించే ప్రాంతం అందరికీ అనుకూలంగా లేకపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. సమయం కూడా ఏప్రిల్‌ చివరి వారం కావడం, ఎండలు విపరీతంగా ఉంటే ఇబ్బందులు రావొచ్చని భావిస్తున్నారట. దూరప్రాంతాల నుంచి వరంగల్‌కు జనం తరలివస్తారా రారా అన్న అనుమానం కూడా పట్టి పీడిస్తోందట.

ఓరుగల్లులో బహిరంగ సభ నిర్వహిస్తే సక్సెస్ అవుతుందా లేదా అన్న డౌట్‌లో గులాబీ నేతలు ఉన్నారట. సిల్వర్ జూబ్లీ సభకు దాదాపు ఐదు లక్షల మంది వస్తారని చెప్పుకుంటున్నా..ఆ సమయంలో జనం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటే అంత మందిని వరంగల్‌కు తరలించడం ఇబ్బంది అవుతుందేమోనని భావిస్తున్నారట. అందుకే సభా వేదికను మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట పార్టీ అధినేత కేసీఆర్.

వరంగల్ కంటే హైదరాబాద్ శివారు ప్రాంతం అయితే బాగుంటుందని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో అయితే జనం వచ్చి పోవడానికి ఈజీగా ఉంటుందని అనుకుంటున్నారట. అందుకే వరంగల్ కంటే మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఘట్‌కేసర్‌లో సభ పెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక్కడ బహిరంగ సభ నిర్వహించేందుకు చాలా అనుకూల అంశాలున్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ కంటే బీఆర్‌ఎస్‌కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. GHMCతో పాటు శివారు ప్రాంతాల్లో పార్టీకి క్యాడర్‌ కూడా గట్టిగానే ఉంది. దీంతో బహిరంగ సభకు జనాలను తరలించడం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట.

గ్రేటర్ పరిధిలోని ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించేలా ఎమ్మెల్యేలకు టార్గెట్‌ ఇచ్చినా 3 లక్షల వరకు జనాలు వస్తారని, మిగతా జిల్లాల నుంచి 2 లక్షల మందిని తరలిస్తే తాము అనుకున్న 5 లక్షల మందికి రీచ్‌ అయిపోతామని అనుకుంటోందట బీఆర్ఎస్ పార్టీ.

అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడం, పార్టీ సిల్వర్ జూబ్లీ సభ అవ్వడం, అందులోనూ కేసీఆర్ హాజరయ్యే సభ కావడంతో గ్రాండ్ సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఉందట గులాబీ పార్టీ. అందుకే ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరక్కుండా, భారీగా జనాన్ని తరలించి బహిరంగ సభను విజయవంతం చేసేలా అడుగులు వేస్తోంది. వరంగల్ వేదికగానే సభ నిర్వహిస్తారా లేక ఘట్‌కేసర్‌కు షిఫ్ట్ చేస్తారా అన్నది చూడాలి మరి.