విస్తరణ సరే.. శాఖల కేటాయింపు ఎప్పుడు? సీఎం మదిలో ఏముంది?
కట్ చేస్తే.. ఆయన అనుచరులు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోధన్ బంద్‌కు పిలుపునిచ్చారు. మల్‌రెడ్డి రంగారెడ్డి అయితే మంత్రి పదవి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నిస్తున్నారట.

CM Revanth Reddy
కింద మీద పడ్డారు. ఏడాదిన్నర సాగదీశారు. ఫైనల్‌గా అమాసపోయింది.. పున్నమి వచ్చింది వెలుగులు తెచ్చిందన్నట్లుగా అన్ని అడ్డంకులు తొలగి..తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఆరు బెర్తులు ఖాళీ ఉండగా..తీవ్ర వడపోత తర్వాత మూడింటిని భర్తీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇందులో ఒక మాల, ఒక మాదిగ, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. ప్రమాణస్వీకారం అయిపోయింది. 24 గంటలు గడిచిపోయింది.
ఇంకా కొత్త మంత్రులకు పోర్ట్ ఫోలియోలు కేటాయించలేదు. మామూలుగా అయితే ఎప్పుడు క్యాబినెట్ ప్రమాణస్వీకారం జరిగిన నాడు సాయంత్రంలోపే మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎంవో నుంచి ప్రకటన వస్తుంది. కానీ ముగ్గురు మంత్రులకు శాఖల అలాట్‌మెంట్‌పై మాత్రం ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. పైగా మంత్రులకు శాఖల కేటాయింపు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఏకంగా ఢిల్లీకి వెళ్లారట. ఫలాన శాఖే కావాలని మంత్రులు పట్టుబడుతున్నారట. పైగా సీఎం రేవంత్ రెడ్డి కూడా తన దగ్గర ఉన్న శాఖలను ఎవరికీ ఇచ్చేందుకు ఇష్టపడట్లేదట. దీంతో శాఖల కేటాయింపు పంచాయతీ ఢిల్లీకి చేరుకుందంటున్నారు.
విస్తరణ అయితే జరిగింది కానీ..కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరున్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా.? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే..ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన దగ్గర ఉన్న శాఖల్లోని కొన్ని కొత్త మంత్రులకు ఇచ్చే యోచనలో సీఎం ఉన్నారట.
Also Read: ఇకపై చేరికలకు షరతులు.. టీడీపీ న్యూరూల్స్..! జాయినింగ్స్‌పై అధిష్ఠానం ఆలోచన ఏంటి?
ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర సాధారణ పరిపాలన శాఖతోపాటు హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్ శాఖలున్నాయి. ఇందులో మున్సిపల్ శాఖ, విద్యాశాఖను వదులుకునేందుకు సీఎం రేవంత్ ఒప్పుకోవట్లేదట. ఆ రెండు శాఖలను తానే పర్యవేక్షించాలని పట్టుదలతో ఉన్నారట సీఎం రేవంత్.
విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో ఇప్పటికే సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇక హోంశాఖ విషయానికి వస్తే కీలక కేసులు ఉండటంతో హోంశాఖను కూడా ఎవరికి ఇవ్వకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ శాఖలను తీసుకునేందుకు సదరు మంత్రులు ఆసక్తిగా ఉన్నారా లేదా అన్నది డిస్కషన్ పాయింట్ అయింది.
సీఎం ఢిల్లీకి వెళ్లడంపై బీఆర్ఎస్ సైటెర్లు
ఇక మంత్రులకు శాఖల కేటాయింపు కోసం కూడా సీఎం ఢిల్లీకి వెళ్లడంపై బీఆర్ఎస్ సైటెర్లు వేస్తోంది. క్యాబినెట్ విసర్తణకే ఏడాదిన్నర పట్టింది. శాఖల కేటాయింపు కూడా ఇప్పట్లో అవుతుందా..దానికి కూడా ఇంకో ఏడాది టైమ్ తీసుకుంటారా అంటూ అటాకింగ్ స్టార్ట్ చేశారు కారు పార్టీ లీడర్లు. ప్రమాణస్వీకారం చేసిన రోజే శాఖలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నా..పోర్ట్ ఫోలియోల పంచాయితీ ఎప్పుడు తేలుతుందో స్పష్టత లేకపోవడంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మిక్స్‌డ్ సినారియో కనిపిస్తోంది. ఒకవైపు సంతోషం, మరోవైపు అలకలు, ఇంకోవైపు బుజ్జగింపులు.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో డిఫరెంట్ సిచ్యువేషన్ కొనసాగుతోంది. మంత్రి పదవులు దక్కిన వారు అధిష్ఠాన పెద్దలను, రాష్ట్ర నేతలను కలిసి హ్యాపీనెస్‌ను షేర్ చేసుకుంటున్నారు. పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్న సీనియర్లు మాత్రం బుజ్జగింపులతో కాస్త మెత్తబడినా అలక మాత్రం వీడినట్లు లేదు.
ఎమ్మెల్యేలు..సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, రాజగోపాల్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి.. అమాత్య పదవి ఆశించి భంగపడ్డారు. వీరితో.. మీనాక్షి నటరాజన్, మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడి సర్ది చెప్పారు. మొదట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డే బుజ్జగింపులకు అంగీకరించి..పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
కట్ చేస్తే.. ఆయన అనుచరులు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోధన్ బంద్‌కు పిలుపునిచ్చారు. మల్‌రెడ్డి రంగారెడ్డి అయితే మంత్రి పదవి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నిస్తున్నారట. ఇలా విస్తరణ వేళ కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. ఈ ఆశావహులను, శాఖల కేటాయింపును కాంగ్రెస్ పెద్దలు ఎలా కొలిక్కి తెస్తారో చూడాలి మరి.