Car Accident : రంగారెడ్డి జిల్లాలో విషాదం.. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళలపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. వాకింగ్‌కు వెళ్లిన మహిళలపై వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.

Car Accident : రంగారెడ్డి జిల్లాలో విషాదం.. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళలపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

Car Accident

Updated On : July 4, 2023 / 10:36 AM IST

Car Accident in Bandlaguda: రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో మంగళవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన  మహిళలపై‌కి వేగంగా వచ్చిన హోండా స్పోర్ట్స్ కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అనురాధ, మమత అనే ఇద్దరు మహిళలు మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతుదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Karimnagar Road Accident : కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోర్టు సన్‌సిటీ పరిధిలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రాతంలో నిత్యం ఉదయం వేళల్లో వందల మంది వాకింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు అదుపు తప్పి వాకింగ్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. కారు వేగానికి పుట్ పాత్ పై వాకింగ్ చేస్తున్న అనురాధ, మమతతో పాటు  అనురాధ కూతురు కవిత కారుతో సహా చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిపోయారు. అనురాధ, మమత  అక్కడికక్కడే మరణించగా.. కవితకు తీవ్ర గాయాలయ్యాయి. కవితను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కారులో ప్రమాదం సమయంలో ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. కారు ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది, కారు డ్రైవ్ చేసే వ్యక్తి మద్యం సేవించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కళ్లముందే వాకింగ్ చేస్తున్నవారు ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చిన కారుతో సహా ముళ్లపొదల్లోకి దూసుకెళ్లడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకొని ప్రమాదానికి గురైన వారిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరికి స్వల్పగా గాయాలైనట్లు తెలిసింది. ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్పారు. అయితే, కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది. కారు డ్రైవ్ చేసింది ఎవరు? కారులో ఎంతమందిఉన్నారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.