కేంద్రం గుడ్‌న్యూస్‌.. లక్ష ఇళ్లు.. ఒక్కొక్కరికి లక్షన్నర.. సిటీలో ఉండేవారికి..

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి ..

కేంద్రం గుడ్‌న్యూస్‌.. లక్ష ఇళ్లు.. ఒక్కొక్కరికి లక్షన్నర.. సిటీలో ఉండేవారికి..

PM Awas Yojana scheme

Updated On : March 16, 2025 / 8:49 AM IST

PM Awas Yojana: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి లక్ష ఇండ్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను పట్టణ ప్రాంతాల్లో ఈ ఇండ్లను మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.

 

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతిఒక్కరికి ఇళ్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీం కింద ఒక్కో ఇంటికి రూ.5లక్షలు ఇచ్చేలా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను మంజూరు చేసింది. ఈ ఏడాది జనవరి 26న రూరల్ ఏరియాలో 71,500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులకు సాంక్షన్ పత్రాలనుసైతం అందజేశారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇండ్ల నిర్మాణం జరుగుతుంది.

 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం పట్టణ ఏరియాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.50లక్షలు, రూరల్ ఏరియాల్లో రూ.72వేలు ఇవ్వనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అంగీకారంతో పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇండ్లకు రూ.1,500 కోట్లు రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించింది. దీంతో లక్ష ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లక్షన్నరకుతోడు రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రూ.3.5లక్షల చొప్పున లబ్ధిదారులకు అందజేయనుంది.

 

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇండ్లను మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. అయితే, ఈ లక్ష ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను పీఎం ఆవాస్ వెబ్ సైట్ లో ఇప్పటికే రాష్ట్ర గృహనిర్మాణ శాఖ అప్ లోడ్ చేసింది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులతో సమావేశమైన రాష్ట్ర హౌసింగ్ అధికారులు రాష్ట్రానికి అర్బన్, రూరల్ కేటగిరీల్లో ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.

 

పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల మంజూరుకు అంగీకరించిన కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులు.. రూరల్ ఇండ్లకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని రాష్ట్ర అధికారులను కోరినట్లు తెలిసింది. అయితే, ఇందిరమ్మ ఇండ్ల మీద పీఎం ఆవాస్ యోజన స్కీం లోగో ఏర్పాటు చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తద్వారా వచ్చే నాలుగేళ్లలో ఎక్కువ ఇండ్లు మంజూరు చేయించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.