CM Breakfast Scheme : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం.. మెనూ ఎలా ఉందో తెలుసా?

ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంతోపాటు డ్రాపౌట్లను తగ్గించి హాజరు శాతాన్ని పెంచడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ఉంది.

CM Breakfast Scheme : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం.. మెనూ ఎలా ఉందో తెలుసా?

CM Breakfast Scheme

Updated On : October 6, 2023 / 7:55 AM IST

CM Breakfast Scheme – Govt Schools : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం గురువారం లాంఛనంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబతా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక పాఠశాలలో గురువారం ఈ కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతనిధులు ప్రారంభించనున్నారు.

మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవులు పూర్తి కాగానే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈ పథకానికి సంబంధించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంపొందిస్తున్నారు. ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించే బాధ్యతలను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగిస్తున్నారు. విద్యాశాఖ, పంచాయతీ రాజ్ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో పని చేసి ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

Also Read : కల్లోల మణిపూర్‌లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం

ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంతోపాటు డ్రాపౌట్లను తగ్గించి హాజరు శాతాన్ని పెంచడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ఉంది. దీన్ని అమలు చేయడం ద్వారా 27 వేల, 147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు కలగనుంది. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకంలో మెనూ చూసినట్లైతే సోమవారం ఇడ్లీ, సాంబర్ లేదా గోధుమ రవ్వ ఉప్మా. మంగళవారం పూరి, ఆలూ కూర్మ లేదా టమాట బాత్.

బుధవారం ఉప్మా, సాంబార్ లేదా కిచిడీ, చట్నీ. గురువారం మిల్లెట్స్, ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్. శుక్రవారం ఉగ్గాని లేదా పోహా మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ, కిచిడీ. శనివారం పొంగల్ సాంబార్ లేదా వెజిటేబుల్ పలావ్ ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.672 కోట్లు ఖర్చు పెడుతోంది.

Also Read: సోషల్ మీడియా విద్యార్ధుల మానసిక పరిస్థితిని దెబ్బ తీస్తోందట.. వాస్తవలు వెల్లడించిన సర్వే

దేశంలోనే ఎక్కడా లేని విధంగా మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో కూడిన భోజనం, వారానికి మూడు గుడ్లను అందజేస్తున్నారు. సన్న బియ్యం కోసం రూ.187 కోట్లు, గుడ్ల కోసం రూ.120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా భరిస్తోంది. దేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు మాత్రమే అమలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు కూడా అందజేస్తున్నారు.

ఇందుకోసం అదనంగా రూ.135 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఐరన్, సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రూ.32 కోట్లు వెచ్చించి రాగి జావను అందిస్తున్నారు. ఇప్పుడు అల్పాహారం పథకంతో ఉదయం విద్యార్థులకు ప్రభుత్వం బ్రేక్ ఫాస్ట్ అందించనుంది.