బీఆర్ఎస్‌కు మ‌రో బిగ్‌షాక్‌..! పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి

మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు.

బీఆర్ఎస్‌కు మ‌రో బిగ్‌షాక్‌..! పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy : బీఆర్ఎస్ పార్టీకి మ‌రో బిగ్‌షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ లేదా రేపు ఆయన, ఆయన కుమారుడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. వారికి పోచారం శ్రీనివాస్ రెడ్డి శాలువాకప్పి ఆహ్వానం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పోచారంను రేవంత్ రెడ్డి కోరారు.

Also Read : పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసేముందు లోకేశ్, టీడీపీ సభ్యుల ఉత్సాహం చూశారా.. వీడియో వైరల్

పోచారం శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. ఆ సమయంలో మంత్రిగానూ పనిచేశారు. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ కు వెళ్లిన సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగాఉన్న పోచారం ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత తొలిసారి ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పోచారం పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గానూ పనిచేశారు. గత ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీచేసేందుకు నిరాసక్తత వ్యక్తం చేశారు. తన కుమారుడుకు బాన్సువాడ టికెట్ కేటాయించాలని కేసీఆర్ ను కోరారు. అయితే, మీరే పోటీచేయాలని కేసీఆర్ సూచించడంతో మరోసారి బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోచారం పోటీచేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో పలువురు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారిలో పోచారం కూడా ఒకరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read : అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారని సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. ఆ పార్టీ నేత బాల్క సుమన్, ఇతర నేతలు పోచారం నివాసానికి చేరుకోవటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోచారం నివాసం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.