ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాం.. మా సర్కారుని ఆ పార్టీలు పడగొట్టాయనుకో..: రేవంత్ రెడ్డి

అప్పట్లో మెదక్ గడ్డ మీది నుంచి ఎంపీగా ఇందిరమ్మను గెలిపిస్తే ఆమె ప్రధాని అయ్యాక పరిశ్రమలు తీసుకువచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాం.. మా సర్కారుని ఆ పార్టీలు పడగొట్టాయనుకో..: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

తెలంగాణలో ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించామని, తమ ప్రభుత్వాన్ని పడగొడితే అడబిడ్డలు చూస్తూ ఊరుకోబోరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కోట్లాది మంది పేదలకు వైద్యాన్ని అందిస్తున్నామని, మహిళలకు రూ.500కే సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఆ పార్టీ నేతలు ఇవాళ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ, కేసీఆర్ కలిసి రూ.400 ఉన్న సిలిండర్ ను రూ.1.200 చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలుచేశామని తెలిపారు. పదేండ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని అన్నారు.

అప్పట్లో మెదక్ గడ్డ మీది నుంచి ఎంపీగా ఇందిరమ్మను గెలిపిస్తే ఆమె ప్రధాని అయ్యాక పరిశ్రమలు తీసుకువచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ పార్లమెంట్ 1999 నుంచి నేటి వరకు బీఆర్ఎస్ చేతిలో ఉందని తెలిపారు. ఇప్పటివరకు కూడా ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బీజేపీ, బీఆర్ఎస్ ఏమీ తేలేదని అన్నారు. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పరిశ్రమలు తెచ్చిందా అని ప్రశ్నించారు.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నీలం మధు గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర ఏళ్లలో చేయనిది తాము మూడు నెలల్లో చేసి చూపించామని తెలిపారు.

కేసీఆర్ బీజేపీలో చేరతారు: పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ప్రజలు ఫాంహౌస్ కే పరిమితం చేశారని అన్నారు. కేసీఆర్ త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని అన్నారు.

జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 25 ఏళ్ల క్రితం ఇందిరమ్మ పాలించిన గడ్డ మెదక్ అని అన్నారు. మెదక్ పార్లమెంట్ ను ఛాలెంజ్ గా తీసుకొని నీలం మధుకు ఓట్లేసి గెలిపించాలని అన్నారు. అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ… సీఎం రేవంత్ కు రుణపడి ఉంటానని తెలిపారు. తనను గెలిపించాలని ప్రజలను కోరారు.

Also Read: వారు అందరూ బీజేపీలోకి వస్తున్నారు.. చివరికి రేవంత్ రెడ్డి కూడా వస్తారు: ఎంపీ అర్వింద్