Cm Revanth Reddy: ఎవరిపై మీ సమరం, ప్రజలపై యుద్ధం చేసి బాగుపడినోళ్లు లేరు- ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ సీరియస్
ఎవరిపై సమరం? ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా?

Cm Revanth Reddy: ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సమ్మె చేయొద్దని చెప్పారు. ఇక సమరమే అంటున్న ఉద్యోగ సంఘాల ప్రకటనపై ముఖ్యమంత్రి రేవంత్ నిప్పులు చెరిగారు. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా? అని ప్రశ్నించారు. ఎందుకు మీ సమరం అని నిలదీశారు. గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? అని ఉద్యోగ సంఘాలను అడిగారు.
”ప్రతీ నెల 7వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానిది. గత పాలకులు 8500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారు. కొన్ని రాజకీయ పార్టీలు మాపై ఆరోపణలు చేస్తున్నాయి. అవన్నీ వాళ్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయిలే. కేవలం 16 నెలల్లో మేం 30 వేల కోట్ల నగదు రైతుల ఖాతాలకు బదిలీ చేశాం. ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి బకాయి పెట్టి వెళ్లారు.
ప్రాజెక్టులు కట్టామని చెప్పి.. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు. మనమంతా కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు. సేవకులం. ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం అని అంటున్నారు.
Also Read: ‘కుక్క కరిచి చనిపోయిన వ్యక్తి’ కేసులో పెద్ద ట్విస్ట్.. ఆ కుక్క అతడ్ని కాపాడడానికి ట్రై చేసిందట..
ఎవరిపై సమరం? ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందాం. మనం సమరం చేయడానికి ఇక్కడ లేము, ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాం. ప్రజలపై యుద్ధం చేసిన వాళ్లు బాగుపడిన వారు ఎవరూ లేరు.
ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు. కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా.. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దు.
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింది. నన్ను కోసినా.. వచ్చిన ఆదాయానికి మించి నేను ఏమీ చేయలేను. ఆర్ధిక విధ్వంసం చేసిన వ్యక్తి… ఇపుడు ఫామ్ హౌస్ లో హాయిగా పడుకున్నారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా ఇప్పుడు కావాల్సింది సమరం కాదు. సమయస్ఫూర్తి, సంయమనం. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణను మళ్లీ కోతుల గుంపుకు అప్పగించొద్దు. నాతో కలిసి రండి. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళదాం” అని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.