తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు గ్రహణం ఏంటి? నల్గొండ నేతలే బ్రేకులు వేస్తున్నారా?

మొత్తానికి నల్గొండ పాలిటిక్స్ కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు గ్రహణం ఏంటి? నల్గొండ నేతలే బ్రేకులు వేస్తున్నారా?

CM Revanth Reddy

Updated On : December 9, 2024 / 8:50 PM IST

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం రోజు రోజుకు పెండింగ్‌లో పడుతోంది. డెడ్‌లైన్ దాటుతున్నా విస్తరణపై ముఖ్యనేతలు నోరు మెదపడం లేదు. పరిపాలన చేపట్టి ఏడాది పూర్తవుతున్నా.. ఇంకా పూర్తి విస్తరణకు నోచుకోవడం లేదు. తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు.

క్యాబినేట్‌లోకి ఇంకా ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆరుగురి ఎంపిక విషయంలో రాష్ట్ర ముఖ్యనేతలు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలతో చర్చలు చేశారు. కానీ సమీకరణాలు కుదరకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ఉన్న ఆరు బెర్తుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని క్యాబినేట్ కూర్పు చేయాలని భావించారు.

ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడడానికి ఒకే ఒక అంశం అడ్డంకిగా మారిందంటూ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ పెద్దలు కొందరికి కమిట్‌మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ బాధ్యతలు ఇవ్వడంతో పాటు గెలిపించుకొని వస్తే.. మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామనే హామీ ఇచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ హామీని నిలబెట్టుకోవాలని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ ఈ హామీ నెరవేర్చాలంటే కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

పొలిటికల్‌గా విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందనా?
ఉమ్మడి నల్లగొండ నుంచి ఇప్పటికే ఇద్దరు సీనియర్ నేతలు మంత్రివర్గంలో ఉన్నారు. జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. ఇద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడం.. మళ్లీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే సామాజిక సమతూకం దెబ్బతినే ప్రమాదం ఉందని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. ముగ్గురు రెడ్లు కావడం అందులోనూ కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఇద్దరికి ఇచ్చినట్లవుతోంది.

దీని వల్ల పొలిటికల్‌గా విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారట. అంతేకాదు అదే జిల్లా నుంచి ఇతర సామాజికవర్గాలైన బీర్ల ఐలయ్య, బాలు నాయక్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పును ఎలా బ్యాలెన్స్ చేయాలనే విషయంలో క్లారీటీ రావడం లేదట. మరోవైపు రాజగోపాల్ రెడ్డి నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హామీ ఇచ్చినప్పుడు ఈ సమీకరణాలు తెల్వదా అని ప్రశ్నిస్తున్నట్లు టాక్. దీంతో పార్టీ పెద్దలు డైలమాలో పడుతున్నారు. ఈ ఒక్క రీజన్ వల్లే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతున్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.

ప్రతిసారి వాళ్లలో ఆశలు
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వాళ్లలో ఆశలు చిగురిస్తుంటాయ్. ఆయన హస్తినా నుంచి వచ్చాక గుడ్‌ న్యూస్‌ ఏం లేదని తెలిసి..సల్లబడిపోతారు. ఇట్ల పది సార్లు ఎదురుచూసి..ఎప్పుడైతే అప్పుడే అని అనుకుంటున్నారు. జరిగితే మాత్రం బెర్త్‌ దక్కేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారట. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నా..ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదన్న చర్చ జరుగుతోంది. అనుకూలంగా ఉన్న వర్గాల ద్వారా ఢిల్లీ పెద్దలతో రాయబారం నడుపుతున్నారట. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంటూనే మరోవైపు ఢిల్లీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గంలో ఈ సారి ఎలాగైనా తమ పేరు ఉండాల్సిందేనని కొందరు సీనియర్లు పట్టుదలతో ఉన్నారట.

మొత్తానికి నల్లగొండ పాలిటిక్స్ కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగిస్తారా.. లేదా క్యాబినేట్‌టోకి తీసుకుంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. మంత్రివర్గ విస్తరణకు ఎప్పుడు ముహుర్తం తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

Cm Revanth Reddy : భవిష్యత్తులో తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో మార్పులు చేస్తే చట్టపరంగా చర్యలు..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం