ఆమెది తెలంగాణ కాదు..! ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటనపై సీఎం రేవంత్ ఆరా
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనం బేస్ మెంట్ లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Delhi Ias Coaching Center Flood Incident (Photo Credit : Google)
Cm Revanth Reddy : ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌తో ఆయన మాట్లాడారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల్లో తెలంగాణ వాసులు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. మృతుల్లో ఎవరైనా రాష్ట్ర వాసులంటే బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయసహకారాలు అందించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే, ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవరూ లేరని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ముఖ్యమంత్రి రేవంత్ కు తెలిపారు.
మృతుల్లో తానియా సోని బీహార్ రాష్ట్రానికి చెందిన యువతి అని వివరించారు. ఆమె తండ్రి విజయ్ కుమార్ సింగరేణి సంస్థలో సీనియర్ మేనేజర్‌గా మంచిర్యాలలో పని చేస్తున్నారని ముఖ్యమంత్రికి తెలియజేశారు రెసిడెంట్ కమిషనర్. విజయ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెసిడెంట్ కమిషనర్‌ను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తానియా సోని మృతదేహాన్ని బీహార్ తరలించడానికి వారి కుటుంబసభ్యులు ఏర్పాటు చేసుకుంటున్నారని రెసిడెంట్ కమిషనర్ తెలిపారు. వారి కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని ముఖ్యమంత్రికి తెలియజేశారు రెసిడెంట్ కమిషనర్.
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనం బేస్ మెంట్ లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా, మృతుల్లో ఒకరైన తాన్య సోనిది(25) తెలంగాణ అనే ప్రచారం జరిగింది. దీంతో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాతీశారు. అయితే, మృతుల్లో తెలంగాణ అమ్మాయి లేదని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ స్పష్టం చేశారు. తాన్యా సోనిది బీహార్ అని తేల్చారు. మృతుల్లో మరొకరు ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్రేయా యాదవ్(25), కేరళకు చెందిన నవిన్ దల్విన్(28) ఉన్నారు. సెల్లార్ ప్రాంతంలో ఒక్కసారిగా 10-12 అడుగుల ఎత్తులో వరద నీరు రావడంతో ఈ ముగ్గురు అందులో చిక్కుకుని చనిపోయారు.
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఓల్డ్ రాజేంద్రనగర్ లోని సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్ వరద నీటితో నిండిపోయింది. అందులో చిక్కుకున్న ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. ఇలాంటి బేస్ మెంట్లలో ఇల్లీగల్ గా నడుస్తున్న లైబ్రరీలను మూసివేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.
Also Read : ఢిల్లీలో దారుణం.. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూఆపరేషన్