CM Revanth Reddy : తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు..!
CM Revanth Reddy : ఎవరు ఎలా మాట్లాడినా.. నేను గుంపు మేస్త్రీనే.. ఈ గుంపంతా నాదే.. ఈ గుంపే నా బలం.. ఈ గుంపే నా ప్రతిష్ఠ.. ఈ గుంపే పేదలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy
CM Revanth Reddy : తెలంగాణ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ముఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడారు.
తెలంగాణ అంటే నమ్మకం.. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులుగా బాధ్యత తీసుకోవడం అంటే భద్రతగా ఆయన పేర్కొన్నారు. ముందుగా సింగరేణి కార్మికులకు బీమా కల్పించాలన్న డిప్యూటీ సీఎం ప్రతిపాదనపై తనకు ఫస్ట్ అనుమానం కలిగిందని సీఎం చెప్పారు.
ఒక్క రూపాయి చెల్లించకుండా కోటి రూపాయల బీమా ఎలా సాధ్యం అవుతుందా? అనిపించిందని చెప్పారు. కానీ, ప్రమాదవశాత్తు మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు ఆ బీమా సొమ్ము అందించి ఆ పథకం సక్సెస్ సాధించిందని ఈ సందర్భంగా వివరించారు.
అదే నమూనాలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఉచిత ప్రమాద బీమా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు బ్యాంకర్లతో ఒప్పందం కూడా కుదిరిందని సీఎం రేవంత్ వెల్లడించారు.
బతికున్నప్పుడు ఉన్న బంధాలు.. చనిపోయాక సానుభూతికే పరిమితవుతాయని, కానీ, ఆర్థిక భరోసా ఇచ్చే బీమా ఉద్యోగుల కుటుంబాలకు నిజమైన ధైర్యాన్ని ఇస్తుందని సీఎం అన్నారు. ఉద్యోగుల భద్రత యజమానిదేనని, ఆ యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
నేను గుంపు మేస్త్రీనే :
రాష్ట్ర అభివృద్ధిపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మేం దొరలం కాదు.. గడీలు లేవు’అంటూ తాను సాధారణ నాయకుడిని, కొందరు తనను ‘గుంపు మేస్త్రీ’అని ఎగతాళి చేసినా అదే తన బలంగా పేర్కొన్నారు. అదే తన ప్రతిష్ఠగా వ్యాఖ్యానించారు. ప్రజలు, ప్రభుత్వం మధ్య వారధులే ఉద్యోగులని రేవంత్ పేర్కొన్నారు.
గత ప్రభుత్వంపై కూడా సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. పదేళ్లలో భారీ అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీశారని ఆరోపించారు. అయినా, ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని సవాళ్లు ఎదురైనా నెల ఫస్ట్ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నట్టు తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను విడతల వారీగా విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు.
రోజుకో గంట అదనంగా పనిచేయండి :
ప్రభుత్వ ఉద్యోగుల కృషి కారణంగానే సంక్షేమ పథకాలు ప్రజలకు విజయవంతంగా చేరుతున్నాయని సీఎం చెప్పారు. రోజుకో గంట అదనంగా పని చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పెరిగిన ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలకు మాత్రమే వాడుకుంటామని హామీ ఇచ్చారు.
మూసీ ప్రక్షాళనతోపాటు మెట్రో విస్తరణ వంటి అభివృద్ధి ప్రాజెక్టులకు అడ్డంకులు అలాగే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుకు సాగుతుందన్నారు. రాజకీయ విమర్శలు వస్తున్నా తనపై వచ్చే వ్యాఖ్యలను ప్రస్తావించానే తప్పా తన నడక, నడతలో మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.
ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం :
2034 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడుతూ పెట్టుబడులను ఆకర్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ కలను సాకారం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
