Cm Revanth Reddy: కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, అంతమాత్రాన అలా అనుకుంటే అది మీ భ్రమ- సీఎం చంద్రబాబుపై రేవంత్ హాట్ కామెంట్స్
రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడటానికి ముందుకు వస్తే సరే సరి. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం.

Cm Revanth Reddy: బనకచర్ల ప్రాజెక్ట్ పై మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో మీకు పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని సీఎం చంద్రబాబును ఉద్దేశించి రేవంత్ అన్నారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చుకోవడం వల్ల అవి పూర్తి కావన్నారు.
గోదావరి బేసిన్ లోని 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్ లోని 555 టీఎంసీలలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటామని, అన్నింటికీ ఎన్ వోసీ ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. ఆ తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లు ఏపీ తీసుకోవడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
”కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు, మీరు ఏం చెబితే అది మోదీ వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని అనుకుంటే అది మీ భ్రమ. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహ రచన మాకు స్పష్టంగా ఉంది. మేము ఈ రోజు వివిధ రాజ్యంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నాము.
రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడటానికి ముందుకు వస్తే సరే సరి. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం, అదీ కాదంటే ప్రజల దగ్గరికి పోతాం. అంతిమ నిర్ణేతలు ప్రజలే. వారి దగ్గరికి వెళ్తాం. కేంద్రంలో మీకు పరపతి ఉందని అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకుంటే అది మీ భ్రమ. మా ఫిర్యాదులను కాకుండా మీకెలా ఇస్తారు. మా ప్రాజెక్ట్ లకు అభ్యంతరం పెడితే.. మేము ఎలా ఊరుకుంటాం” అని సీఎం రేవంత్ అన్నారు.