Delimitation : డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు.. మోదీకి రేవంత్ ‘ఎక్స్’లో పోస్ట్.. ఘాటుగా స్పందించిన కిషన్ రెడ్డి
Delimitation : వారానికి ఒకసారి ఢిల్లీకి సీఎం ఎందుకు వెళ్తున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వాలన్నా ఢిల్లీకి కట్టలు మోయాలి. బీజేపీ విధానం అది కాదు.. రేవంత్ రెడ్డి మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Revanth Reddy Narendra Modi Kishan Reddy
Delimitation : డీలిమిటేషన్ అంశం మళ్లీ వేడెక్కుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీలక అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అదే సమయంలో ఎక్స్ వేదికగా దక్షిణాది రాష్ట్రాల హక్కులకోసం గళం విప్పారు. మహిళా బిల్లుకు ప్రతిఒక్కరూ మద్దతిస్తారన్న సీఎం.. లోక్‌సభ సీట్ల పెంపు విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయనంటూ పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పోస్టు ప్రకారం.. ‘‘లోక్‌సభ సీట్ల పునర్విభజన అంశం, మహిళా రిజర్వేషన్లు బిల్లు వేరువేరు అని ప్రతి పౌరుడికి స్పష్టంగా తెలుసు. అసెంబ్లీ సీట్లలో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే దేశం మొత్తం ఆమోదిస్తుంది. మహిళా రిజర్వేషన్ల పేరుతో.. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచాలని బీజేపీ చూస్తోంది. దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు ఈ విధానం అన్యాయం చేస్తుంది. ప్రస్తుతం బీజేపీకి ఈ విధానం మేలు చేయొచ్చు.. కానీ, భవిష్యత్తులో దేశాన్ని బలహీనం చేస్తుంది. ఏ పార్టీకైనా జాతీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉండాలి’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డీలిమిటేషన్ పై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కావాలి. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డీలిమిటేషన్‌కి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అన్నారు.
Also Read : TG TET : టెట్ నోటిఫికేషన్ విడుదల.. జూన్ నెలలో పరీక్షలు.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే? పూర్తి వివరాలు ఇలా..
మహిళకు రిజర్వేషన్లు కల్పించాలంటే డీలిమిటేషన్ చేయాల్సిందే : కిషన్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ పోస్ట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మహిళా రిజర్వేషన్లపైన సీఎం రేవంత్ రెడ్డి అవగాహనలోపంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 15, 16, 17 తేదీల్లో పార్లమెంట్లో జరిగే చర్చలో అందరు ఎంపీలు మాట్లాడవచ్చు. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని నరేంద్ర మోడీ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతున్నాను.. దీనిని రాజకీయాలు చేయొద్దు. దశాబ్దాలుగా మీరు పరిపాలన చేశారు. అంబేద్కర్ చెప్పిన మహిళల రిజర్వేషన్ల గురించి మీరు పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ మహిళలకు రిజర్వేషన్లు తీసుకొస్తుంటే కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
70 కోట్ల మంది మహిళల గౌరవాన్ని పెంచాలి. వారికి హక్కులు కల్పించాలని రిజర్వేషన్లు తీసుకు వస్తున్నాం. మేము దక్షిణాదిలోనే ఉన్నాము.. మేము ఎవరికి అన్యాయం జరగనివ్వం. మహిళకు రిజర్వేషన్లు కల్పించాలంటే డీలిమిటేషన్ చేయాల్సిందే. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు సహకరించాలి. పూర్తిస్థాయి సెన్సెస్ రావాలంటే రెండేళ్లు పడుతుంది. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దు అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
వారానికి ఒకసారి ఢిల్లీకి సీఎం ఎందుకు వెళ్తున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వాలన్నా ఢిల్లీకి కట్టలు మోయాలి. బీజేపీ విధానం అది కాదు.. రేవంత్ రెడ్డి మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
