పది మంది ఎమ్మెల్యేల రక్షణకు ప్రభుత్వ పెద్దల భారీ వ్యూహం!

పది మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలనే అసలు వ్యూహమే కారణమంటున్నారు.

పది మంది ఎమ్మెల్యేల రక్షణకు ప్రభుత్వ పెద్దల భారీ వ్యూహం!

Updated On : September 14, 2024 / 8:19 PM IST

బీఆర్‌ఎస్‌ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాంగ్రెస్‌కు బ్రహ్మాస్త్రం దొరికిందా? అనర్హత వేటు నుంచి ఎమ్మెల్యేను రక్షించుకునే ప్లాన్‌ రెడీ చేస్తోందా? పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు… పీఏసీ చైర్మన్‌ నియామకంపై ప్రస్తుతం నెలకొన్న హైటెన్షన్‌కు కొనసాగింపుగా కాంగ్రెస్‌ వేస్తున్న కొత్త ఏంటి? రాష్ట్ర రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పే కాంగ్రెస్‌ ప్లాన్‌ నిజంగా వర్క్‌ అవుట్ అవుతుందా? జంపింగ్‌ ఎమ్మెల్యేల రక్షణకు కాంగ్రెస్‌ అమలు చేయనున్న ప్లాన్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం….

తెలంగాణలో ఫిరాయింపు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా, వారిలో ముగ్గురిపై అనర్హత కత్తి వేలాడుతోంది. మిగిలిన ఏడుగురిపైనా చర్యలకు బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరిన మొత్తం పది మంది ఎమ్మెల్యేల రక్షణకు ప్రభుత్వ పెద్దలు భారీ వ్యూహం రచించారంటున్నారు.

బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనమే అజెండాగా ఇన్నాళ్లు పావులు కదిపిన కాంగ్రెస్‌… తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే ఆ పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు బయటకు రావాల్సివుంటుంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు అధికారికంగా 38 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇందులో 10 మంది కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఇక మిగిలిన 28 మందిలో 16 మందిని కలుపుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌… ప్రస్తుతానికి చేతులెత్తేసినట్లు చెబుతున్నారు.

వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు
ప్రభుత్వం ఆశించినట్లు బీఆర్‌ఎస్‌ నుంచి చేరేందుకు మిగిలిన ఎమ్మెల్యేలు ఆసక్తి చూపకపోవడం…. ఈ లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌… సభాపతిపై ఒత్తిడి పెంచేందుకు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పునివ్వడంతో ప్రభుత్వం ప్లాన్‌ బీ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

హైకోర్టు సూచనలతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా వేటు వేయాల్సివుంటుందని ఆందోళన చెందిన కాంగ్రెస్‌ పార్టీ… తన అమ్ములపొదిలో ఉన్న బ్రహ్మస్త్రాన్ని బయటకు తీసినట్లు చెబుతున్నారు. శాసనసభ నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీ నుంచి నాలుగో వంతు సభ్యులు బయటకు వచ్చి తమను సెపరేట్‌ గ్రూప్‌గా గుర్తించాలని కోరితే అనర్హత వేటు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు త్వరలో స్పీకర్‌ను కలిసి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌ ప్లాన్‌ లీక్‌!
ఇప్పటివరకు గుట్టుగా ఉంచిన కాంగ్రెస్‌ ప్లాన్‌ తాజాగా లీకైంది. ఈ వ్యూహం ప్రకారమే కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్‌గా నియమించారంటున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేకు పీఏసీ పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్‌ నిలదీయడం… దీనిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తూ వ్యవహారాన్ని రచ్చ చేయడంతో కాంగ్రెస్‌ అసలు ప్లాన్‌ బయటపడిందని అంటున్నారు.

గత మూడు రోజులుగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, పీఏసీ చైర్మన్‌ గాంధీ మధ్య వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ గొడవకు దారితీసిన పీఏసీ చైర్మన్‌ నియామకానికి…. పది మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలనే అసలు వ్యూహమే కారణమంటున్నారు. గాంధీ కాంగ్రెస్‌లో చేరినా, ప్రతిపక్ష నేతగా చూపిస్తూ పీఏసీ చైర్మన్‌గా నియమించడంతో టెక్నికల్‌గా మిగిలిన ఎమ్మెల్యేలకూ రక్షణ కల్పించొచ్చని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. అయితే దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్న కాంగ్రెస్‌ పెద్దలు నేడో.. రేపో ఈ వ్యూహాన్ని అమలు చేయొచ్చని టాక్‌ నడుస్తోంది.

లైన్‌ క్లియర్‌.. రోజా రిటర్న్స్.. ఏం జరుగుతోందో తెలుసా?