Dharani Portal : ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష, కీలక ఆదేశాలు జారీ
ధరణి పోర్టల్ పై సుదీర్ఘమైన సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు సంబంధిత అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

CM Revanth Reddy Review On Dharani Portal
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని పథకాలు, కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా ధరణి పోర్టల్ పై ఫోకస్ పెట్టారు. సెక్రటేరియట్ లో ధరణి పోర్టల్ పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ క్రమంలో ధరణి పోర్టల్ లో లోటుపాట్లపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయన్న ఆయన.. ఫిర్యాదుల పరిష్కారానికి మండల స్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అటు ధరణి లావాదేవీలు, భద్రతపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : గిరిజనుల భూములు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
ధరణి పోర్టల్ పై సుదీర్ఘమైన సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు సంబంధిత అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమైన అజెండాలలో ఒకటి ధరణి. కేసీఆర్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని, దీని వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి వచ్చాక ధరణిని మార్చేస్తామని హామీ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ఇవాళ ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం కీలకంగా చెప్పుకోవాలి. ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ తీసుకొస్తామని కాంగ్రెస్ చెప్పిన విషయం విదితమే. ధరణిలో ఏర్పాటైనప్పటి నుంచి ఎన్ని అక్రమాలు జరిగాయి? అన్నదానిపై నివేదిక సమర్పించాలని అధికారులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
ధరణి ఏర్పాటయ్యాక ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి అన్నది లిస్టౌట్ చేసే పనిని అధికారులకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా ధరణిలో మాడ్యూల్స్ పేరుతో రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మాడ్యూల్స్ ను మార్పు చేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతిని ఏర్పాటు చేయబోతోంది రేవంత్ సర్కార్. ఇప్పుడున్న పోర్టల్ లో కరెక్షన్ చేసే అధికారం కేవలం అధికారులకు మాత్రమే ఉంది. దానివల్ల రైతులు, భూ హక్కుదారులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ప్రభుత్వం భావిస్తోంది. కలెక్టర్ తో పాటు ఆర్డీవో, ఎమ్మార్వోలకు కూడా బాధ్యతలు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
Also Read : తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం పౌరసరఫరాలశాఖ కసరత్తు
అలాగే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి భూహక్కుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కారం చేసే విధంగా అధికారులు దీనిపై ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలకు అప్పిలేట్ అథారిటీ ఇవ్వాలన్నది మరో ప్రధాన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ధరణిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన దానిపై సమీక్షించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.