కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న రేవంత్ సర్కార్..!
రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టింది. దీంతో శనివారం జరిగే మంత్రిమండలి సమావేశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Telangana Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది. దాదాపు రెండు నెలల తర్వాత… శనివారం భేటీ జరగనుంది. మార్చిలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొన్న ప్రభుత్వం.. రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టింది. దీంతో శనివారం జరిగే మంత్రిమండలి సమావేశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దాదాపు 2 నెలల తర్వాత క్యాబినెట్ భేటీ..
తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. అధికారం చేపట్టిన 100 రోజులకే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇంతకాలం పాలనపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సచివాలయంలో మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు రెండు నెలల తర్వాత జరగనున్న ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలపై ప్రత్యేక చర్చ..
అకాల వర్షాలు, రైతు రుణమాఫీ, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటుతోపాటు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలపై ప్రత్యేకంగా ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. పొలాలు, కళ్లాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిచిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్యపై కేబినెట్‌లో చర్చించి రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం.
రైతు రుణమాఫీపై చర్చ..
ఇక కాంగ్రెస్ ఎన్నికల హామీ అయిన 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీపైనా మంత్రి మండలిలో చర్చించనున్నారు. రుణమాఫీపై పార్లమెంట్ ఎన్నికల్లోనూ మాట ఇచ్చినందున.. ఆగస్టు 15లోగా రుణమాఫీ సాధ్యాసాధ్యాలను చర్చించనున్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా ప్రభుత్వ గ్యారెంటీ రుణం తీసుకుని, రైతులకు ఏకకాలంలో రుణ విముక్తి కల్పించాలని ఆలోచిస్తోంది ప్రభుత్వం.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి?
ఇక వచ్చే నెల 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది రేవంత్‌రెడ్డి సర్కార్. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తుండటంతో భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ ఉత్సవాలు ఎలా చేయాలి? ఎక్కడ చేయాలి? అన్నదానిపైనా మంత్రి మండలిలో చర్చించనున్నారు. ఇదే సమయంలో విభజన సమస్యల పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలను అజెండాలో చేర్చినట్లు చెబుతున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల సమీకరణపైనా దృష్టిపెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లపై చర్చ..
ఇక కుంగిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లపై చర్చించనున్నారు. ఈ బ్యారేజీల కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన మధ్యంతర నివేదికపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఈ నివేదిక ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపైనా నిర్ణయం తీసుకోవాల్సివుంది. మొత్తానికి ఎన్నికల తంతు పూర్తవడంతో పాలనపై దృష్టి పెట్టిన రేవంత్‌రెడ్డి సర్కార్ తీసుకోబోయే నిర్ణయాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Also Read : ముంబై ఘటనతో హడలిపోతున్న హైదరాబాద్ సిటీ జనం.. ఎందుకో తెలుసా?