ఎమ్మెల్సీ స్థానం కోసం TRSలో పోటీ

ఎమ్మెల్సీ స్థానం కోసం TRSలో పోటీ

Updated On : July 4, 2020 / 5:08 PM IST

తెలంగాణలో త్వరలో భర్తీకానున్న శాసనమండలి సభ్యుల స్థానాలను దక్కించుకునేందుకు TRS నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గవర్నర్‌ కోటాలో త్వరలో మూడు స్థానాలను భర్తీ చేసే అవకాశముంది. ఈ స్థానాలకు సీఎం కేసీఆర్‌ ఎవరి అభ్యర్థిత్వాన్ని ఫైనల్‌ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మండలిరేస్‌లో మరో ప్రముఖ పేరు వచ్చి చేరడంతో నేతలు ఒకస్థానంపై ఆశలు వదులుకుంటున్నారు.

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వచ్చే నెలలో మరో స్థానం కూడా ఖాళీ కాబోతోంది. దీంతో ఖాళీ అవుతున్న మూడు స్థానాలు కూడా టీఆర్‌ఎస్‌కే దక్కనున్నాయి. ఈ మూడు ఎమ్మెల్పీ పదవులపై టీఆర్ఎస్‌లో రేస్‌ మొదలైంది. ఆశావహులంతా తమ ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో కొంతమంది నేతలకు సీఎం కేసీఆర్‌ హామీ కూడా ఇచ్చారు. దీంతో వారంతా ఈ మూడు స్థానాల్లో తమకు అవకాశం దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నారు.

సామాజిక వర్గాల వారీగా భర్తీచేస్తారా.. లేదంటే.. ప్రస్తుతం పదవికాలం పూర్తవుతున్న నేతలకే మరోసారి అవకాశం కల్పిస్తారా అన్న చర్చ కూడా గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. మాజీమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పదవీకాలం జూన్‌లోనే పూర్తయ్యింది. ఆగస్టులో కర్నె ప్రభాకర్‌ పదవీకాలం కూడా ముగియనుంది. రాములునాయక్‌పై అనర్హత వేటు పడడంతో.. ఆ స్థానం కూడా ఖాళీ అయ్యింది. మూడింటిలో కనీసం ఒకరు లేదా ఇద్దరికి మరోసారి కేసీఆర్‌ అవకాశం ఇస్తారన్న చర్చ సాగుతోంది. మిగిలిన స్థానాలకు దాదాపు అరడజను మందికిపైగా నేతలు పోటీలో ఉన్నారు.

ఎమ్మెల్సీ టికెట్‌ కోసం ఆశావహులంతా తమ ప్రయత్నాలు చేస్తుండగా… ఇప్పుడు అనూహ్యంగా మరోపేరు తెరపైకి వచ్చింది. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా… పీవీ కూతురు వాణికి శాసనమండలి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీవీ శతజయంతి వేడుకల సందర్భంగా పలుమార్లు కేసీఆర్‌తో వాణి భేటీ అయ్యారు. దీంతో గవర్నర్‌ కోటాలో ఆమెకు అవకాశం కల్పించే చాన్స్‌ లేకపోలేదన్న చర్చ పార్టీలో మొదలైంది.

విద్యా సంస్థలను నిర్వహిస్తూ.. విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఆమెకు.. మండలిలో అవకాశం కల్పిస్తే… పీవీ కుటుంబానికి తగిన గుర్తింపు ఇచ్చినట్టు అవుతుందని కేసీఆర్‌ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో జరుగబోయే మంత్రి మండలి సమావేశంలో గవర్నర్‌ కోటా శాసనమండలి అభ్యర్థుల పేర్లపైనా చర్చించే అవకాశముంది. క్యాబినెట్‌ తీర్మానం కూడా చేసే చాన్స్‌ ఉంది. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందన్న ఆసక్తి నెలకొంది.

Read:కరోనా వేళ : రోజుకు రూ. 68 కోట్ల మద్యం తాగేస్తున్నారు..ఎక్సైజ్ శాఖ ఖజానా గలగల