Revanth Reddy : 17న మేనిఫెస్టో విడుదల, 18వ తేదీ నుంచి ప్రచారం- రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సభ కోసం అనుమతి కోరామన్నారు. ఈ నెల 6న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వస్తారని..Revanth Reddy - Congress

Revanth Reddy - Congress (Photo : Google)
Revanth Reddy – Congress : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. అన్ని పార్టీలు ఎన్నికలకు రెడీ అయిపోయాయి. గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటీకే అందరికన్నా ముందుగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి అధికార బీఆర్ఎస్ దూకుడు మీదుంది. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా తమ రేసుగుర్రాలను ఎంపిక చేసే కసరత్తును ముమ్మరం చేశాయి. రేపోమాపో తొలి జాబితాను విడుదల చేయనున్నాయి.
ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఇందుకోసం వ్యూహాలు రచిస్తోంది. దీనికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని చూస్తున్నారు. తద్వారా ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు.
తాజాగా సీడబ్ల్యూసీ మీటింగ్, బహిరంగ సభ గురించి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి విజయానికి వ్యూహం తెలంగాణలో రూపొందుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ ప్లేస్ ఇంకా ఫైనల్ చేయలేదని ఆయన తెలిపారు. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సభ కోసం అనుమతి కోరామన్నారు. ఈ నెల 6న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వస్తారని బహిరంగ సభ, సీడబ్ల్యూసీ సమావేశంపై సమీక్ష జరిపిన అనంతరం నిర్ణయిస్తారని వెల్లడించారు. సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చిన నేతలు 18 నుంచి ప్రచారం చేస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక, సెప్టెంబర్ 17న మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.
”తెలంగాణ రాష్ట్రంలో సీడబ్ల్యూసీ సమావేశాలను, బహిరంగ సభను, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 5 గ్యారంటీల ప్రకటన చేయడం, అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాల మీద ఛార్జిషీట్లు విడుదల చేయడం, ఈ 5 గ్యారంటీలను 119 నియోజకవర్గాల్లో ప్రచారం చేసే కార్యక్రమాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వెళ్లనుంది” అని రేవంత్ రెడ్డి చెప్పారు.