Corona For Lions : సింహాల నుంచి మనుషులకు కరోనా సోకదు..
హైదరాబాద్ నెహ్రూ జూపార్కులోని 8 సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్న వార్తలపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పందించింది.

Corona For Lions
Corona does not infect humans from lions : హైదరాబాద్ నెహ్రూ జూపార్కులోని 8 సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్న వార్తలపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పందించింది. అయితే ఈ వైరస్ వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. జంతువులకు కరోనా సోకడం దేశంలోనే తొలిసారి అయినప్పటికీ, వాటి నుంచి మనషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందడం ఇప్పటి వరకు జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల జూను సందర్శించిన వారెవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఆ 8 సింహాల్లో ఏప్రిల్ 24న కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆ జంతువులకు అనస్థీషియా ఇచ్చి ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపారు. ఆ నమూనాలను పరీక్షించిన తర్వాత.. 8 సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మే 4న CCMB- LaCONES ప్రకటించింది.
అయితే లక్షణాలు కనిపించిన రోజు(ఏప్రిల్ 24) నుంచే మందు జాగ్రత్తగా జూ అధికారులు, సిబ్బంది చికిత్స ప్రారంభించారు.
దీంతో సింహాలు అన్నీ ఇప్పటికే కోలుకున్నాయని అధికారులు తెలిపారు. సాధారణ స్థితికి చేరుకున్నాయని స్పష్టం చేశారు. ఎనిమిది సింహాలను ముందుగానే వేరుగా (ఐసోలేషన్) చేసి, తగిన జాగ్రత్తలతో పాటు అవసరమైన చికిత్స అందించారు. ఎనిమిది సింహాలూ చికిత్సకు బాగా స్పందించి కోలుకున్నాయని చెప్పారు. అవి మామూలుగా ప్రవర్తిస్తున్నాయని, ఆహారం బాగా తింటున్నాయని పేర్కొన్నారు.
జూ సిబ్బందికి కరోనా సోకకుండా నివారణ చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. సెంట్రల్ జూ అథారిటీ నిబంధనల మేరకు జూను ఇప్పటికే మూసివేశారు. సందర్శకులను అనుమతించడం లేదు.