Corona for 38 students : నాగోల్‌ మైనార్టీ గర్ల్స్ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 38 విద్యార్థులకు కరోనా

హైదరాబాద్‌ నాగోల్‌లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో కరోనా కలకలం రేగింది. 38 విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Corona for 38 students : నాగోల్‌ మైనార్టీ గర్ల్స్ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 38 విద్యార్థులకు కరోనా

Corona For 38 Students At Nagole Minority Girls Residential School Hyderabad

Updated On : March 16, 2021 / 10:01 PM IST

Corona for 38 students : తెలంగాణలో కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. పలు పాఠశాలల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌ నాగోల్‌లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో కరోనా కలకలం రేగింది. 38 విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు వణికిపోతున్నారు. అప్రమత్తమైన అధికారులు కోవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

మొత్తం 184 మంది విద్యార్ధినులకు పరీక్షలు చేయగా.. 38 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మిగితావారికి అధికారులు RTPCR పరీక్షలు చేస్తున్నారు. అయితే కరోనా సోకిన 38 విద్యార్ధులకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన విద్యార్ధులను ఇళ్లకు పంపేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. పాజిటివ్‌ వచ్చిన వారికి స్కూల్‌లోనే ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తామని తెలిపింది.

మంచిర్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఇవాళ 175 మందికి పరీక్షలు నిర్వహించగా 35 మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. విద్యార్థులతో పాటు ఆరుగురు తల్లిదండ్రులకు వైరస్‌ సోకింది. దీంతో వైరస్‌ బాధితులను హోం క్వారంటైన్‌లో ఉండాలని స్కూలు ప్రిన్సిపాల్‌ సూచించారు. కరోనా వ్యాప్తితో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లిలో ఇవాళ 130 మంది గ్రామస్థులకు కరోనా పరీక్షలు చేయగా.. 20 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రామడుగు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యాధికారులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.

నిన్న మంచిర్యాల బాలికల ప్రభుత్వ పాఠశాలలో 52 మందికి కోవిడ్‌ బారినపడ్డారు. వెంటనే అప్రమత్తమైన డీఈఓ మూడు రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో నిన్న ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అవ్వగా.. ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా పాఠశాలలోని ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.