జగిత్యాల జిల్లాలో మళ్లీ కరోనా కల్లోలం..ఒకే కుటుంబంలో ఏడుగురికి పాజిటివ్

జగిత్యాల జిల్లాలో మళ్లీ కరోనా కల్లోలం..ఒకే కుటుంబంలో ఏడుగురికి పాజిటివ్

Updated On : March 5, 2021 / 4:21 PM IST

Corona for seven people in the same family : దేశంలో కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో కోవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

జగిత్యాల జిల్లా కరోనా కలకలం రేగింది. మల్యాల మండలం ముత్యంపేట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. కుటుంబ యజమాని దుబాయ్‌ నుంచి రావడంతో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే అతను వచ్చిన విమానం దుబాయ్‌ నుంచి యూకే మీదుగా రావడంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపినట్లు జిల్యా వైద్యాధికారి శ్రీధర్‌ వెల్లడించారు. కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై ప్రచారం జరుగుతుండడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుండగా..మరోవైపు కొత్త కేసులు 17వేలకు చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం(మార్చి 4, 2021) 7లక్షల 61వేల 834 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..16వేల 838 కొత్త కేసులు వెలుగుచూశాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షల 73వేల 761కి చేరుకుంది. మూడు రోజుల తర్వాత తాజాగా మరణాల సంఖ్య 100 దాటింది. గడిచిన 24 గంటల్లో 113 మంది వైరస్‌కి బలయ్యారు. ఇప్పటివరకు లక్షా 57వేల 548 మంది కొవిడ్ తో చనిపోయారు.