కరోనా భయం..భయం : హైదరాబాద్‌లో బారికేడ్లు..నో ఎంట్రీ

  • Published By: madhu ,Published On : April 10, 2020 / 06:23 AM IST
కరోనా భయం..భయం : హైదరాబాద్‌లో బారికేడ్లు..నో ఎంట్రీ

Updated On : April 10, 2020 / 6:23 AM IST

కరోనా భయం వీడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పడగ విప్పుతోంది. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతోంది. కానీ పలు ఏరియాల్లో ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో మరింత కఠినంగా ఉండాలని అధికారులు నిర్ణయించారు. కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వే చేపడుతున్నారు. అనుమానంగా ఉన్న వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆయా ఏరియాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తున్నారు. 

రాంగోపాల్ పేట తదితర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డిలు పరిశీలించాు. వైద్యాధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు. వీరికి పోలీసులు సహకరించారు. కరోనా అనుమానితులుంటే..ఆసుపత్రికి తరలించారు.

గోల్కొండలో మల్లేపల్లి ప్రాంతాన్ని కంటోన్మెంట్ ప్రాంతంగా గుర్తించారు. డీజీపీ ఎం మహేందర్ రెడ్డి తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పర్యటించారు. బడా మసీదు, ఇతర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేసి..పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు డీజీపీ, సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. 

కుత్బుల్లాపూర్ లో అధికారులు పర్యటించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, వైద్యాధికారులు, పోలీసులు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. గాజుల రామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు కుత్బుల్లాపూర్ లోని రోడా మేస్త్రీ నగర్, చంద్రగిరి నగర్, చింతల్, షాపూర్ నగర్ తదితర ప్రాంతాల్లో వీరు పర్యటించారు. 

అల్వాల్ లోని పలు ప్రాంతాలఅను కంటైన్ మెంట్ క్లస్టర్లుగా గుర్తించారు. అత్యవసరమైతే బయటకు రావాలని, ఒకవేళ ఏమీ పని లేకపోయినా వస్తే..మాత్రం వాహనాలను సీజ్ చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు. అల్వాల్ లో తనిఖీలు నిర్వహించి…బారికేడ్లను ఏర్పాటు చేశారు. బాలానగర్ అడిషనల్ క్రైం డీసీపీ ఇందిర, తదితరులు పాల్గొన్నారు. 

శామీర్ పేటలోని తుర్కపల్లిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం ఈ ఏరియాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఇంటి సమీపంలోని ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. 44 మంది కరోనా అనుమానితులను క్వారంటైన్ కు తరలించారు. వైద్యాధికారులు ఇంటింటికి తిరిగి పరీక్షలు చేశారు. 

యాకుత్ పరాలో జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, డిప్యూటీ కమిషనర్ అలివేలు, వైద్యాధికారులు, పోలీసులు పర్యటించారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధం విధించారు. కంటైన్ మెంట్ క్లస్టర్ గా గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 

హఫీజ్ పేటలో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. చంద్రానగర్ సర్కిల్ పరిధిలోని నాలుగు బస్తీలను అష్టదిగ్భందనం చేశారు. జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు పలు ఏరియాల్లో పర్యటించారు. 54 ప్రధాన, అంతర్గత రహదారులను మియాపూర్ పోలీసులు మూసివేశారు. 

చాదర్ ఘాట్ పరిధిలోకి వచ్చే..ఓల్డ్ మలక్ పేట, ఆజంపూర లో కంటైన్ మెంట్ క్లస్టర్లుగా ప్రకటించారు. తమ తమ కాలనీల్లోకి ఇతరులు రాకుండా..సొంతంగా కాలనీ వాసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.