వామ్మో.. గాంధీ భవన్‌‌కు రాంరాం.. కరోనా టెన్షన్..!

  • Published By: sreehari ,Published On : July 16, 2020 / 09:57 PM IST
వామ్మో.. గాంధీ భవన్‌‌కు రాంరాం.. కరోనా టెన్షన్..!

Updated On : July 16, 2020 / 10:48 PM IST

ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనాకు చిన్నాపెద్దా తేడా లేదు. రాజు, పేద భేదం లేదు. అగ్రరాజ్యాల నేతల్నే మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలకు కూడా కరోనా గుబులు పట్టుకుంది. బడా లీడర్ల నుంచి చోటా నేతల వరకూ… గాంధీ భవన్‌వైపు చూడాలంటేనే జంకుతున్నారు. ఇటీవల వరుసగా నాయకులు కరోనా కాటుకు చనిపోవడంతో… పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటానికి భయపడుతున్నారని టాక్‌ వినిపిస్తోంది.

కాంగ్రెస్‌లో ఇప్పటికే ఇద్దరు నాయకులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మైనార్టీ సెల్ మాజీ ఛైర్మన్ సిరాజుద్దీన్, తాజాగా గ్రేటర్ హైద్రాబాద్ నాయకుడు నాగేందర్ యాదవ్‌ కన్నుమూశారు. అంతకుముందు మాజీ ఎంపీ వీహెచ్‌ దంపతులు, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బాలమూర్ వెంకట్‌తో పాటు పలువురు నేతలు కరోనా బారినపడి కోలుకున్నారు.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా కాంగ్రెస్ నేతలు కరోనా కాలంలోనే ఎక్కువ మాస్ గ్యాదరింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెట్రోల్ ఛార్జీల పెంపు, విద్యుత్ బిల్లుల రద్దు, అమర సైనికులకు సంఘీభావ దీక్షలు, రైతు సమస్యలు, ఛలో విద్యుత్‌ సౌధ అంటూ… వరుస కార్యక్రమాలతో రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు.

ఇలా వందలమంది ఒక్కచోట గుంపుగా చేరడంతో… వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చి ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే దివంగత నేత వైఎస్ జన్మదినం సందర్భంగా గాంధీభవన్‌కు వచ్చిన సీనియర్ నేతలు.. అంటీముట్టనట్టు దూరందూరంగా ఉండి… ఏదో మమ అనిపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాజాగా నాగేంద్ర యాదవ్‌ మృతితో పార్టీ కేడర్‌లో టెన్షన్‌ పీక్స్‌కు చేరింది. కరోనా ఉధృతి తగ్గే వరకూ పార్టీ కార్యక్రమాలు తగ్గించాలని… అత్యవసరమైతే తప్ప గాంధీభవన్‌ వైపు రాలేమని పీసీసీ అధ్యక్షుడికి మొర పెట్టుకున్నారట. చాలామంది నేతలు వయసు పెరగడంతో… అనవసరంగా కరోనాను కొని తెచ్చుకోవడం ఇష్టం లేదట.

అందుకే పార్టీ కార్యక్రమాలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉంటామంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మెసేజ్‌లు పెట్టి రిక్వెస్ట్‌ చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్‌ జెండా పట్టాలంటే ముందు మేం బతికుండాలి.. అలా ఉండాలంటే కరోనాను దరి చేరనీయకుండా చూసుకోవాలంటూ… గాంధీభవన్‌కు రాంరాం అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.