Crocodile: బాబోయ్.. మూసీలో పెద్ద మొసలి సంచారం.. భయాందోళనలో స్థానికులు..
స్థానిక యువకులు నది ఒడ్డుకు వస్తున్నారు. మొసలి వీడియోలు తీస్తున్నారు.

Crocodile
Crocodile: హైదరాబాద్ చైతన్యపురిలో మొసలి సంచారం కలకలం రేపింది. పెద్ద మొసలి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. చైతన్యపురిలో మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆ మొసలి ప్రత్యక్షమైంది. ఫణిగిరి కాలనీలోని శివాలయం వద్ద మొసలి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 4 రోజుల క్రితం నది మధ్యలో గడ్డి కోస్తున్న వ్యక్తికి మొసలి కనిపించింది. మొసలిని చూసి అతడు భయపడిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేశాడు.
రెండు రోజులుగా స్థానిక యువకులు నది ఒడ్డుకు వస్తున్నారు. మొసలి వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. మొసలి కదలికలపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. శివాలయం వైపు ఎవరూ వెళ్లొద్దని అక్కడ మొసలి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు కూడా స్పందించారు. నది మధ్యలో ఉన్న మొసలిని ఏమీ చేయలేమని వారు చెప్పారు. అటవీ శాఖ అధికారులు మొసలిని బంధించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: కేవలం రూ.5కే హైదరాబాద్‌లో బ్రేక్ ఫాస్ట్.. పథకం అమలు ఆరోజు నుంచే.. తొలి దశలో 60 క్యాంటీన్లలో..
కాగా.. మూసీ నదిలో మొసళ్లు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. దీంతో మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసితులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మొసళ్లు ఎక్కడ దాడి చేస్తాయోనని బయటకు వెళ్లాలంటేనే ప్రాణ భయంతో వణికిపోతున్నారు.