హైదరాబాద్ పాతబస్తీలో మొసలి కలకలం, భయాందోళనలో స్థానికులు

హైదరాబాద్ పాతబస్తీలో మొసలి కలకలం రేపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి పురానాపూల్‌కు మొసలి కొట్టుకు వచ్చింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. జూపార్క్ సిబ్బంది.. మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అఫ్జల్ గంజ్ సమీపంలోని పురానాపూల్ బ్రిడ్జి దగ్గర మొసలి కనిపించింది. నీళ్లలో నుంచి ఒడ్డుకు వచ్చిన మొసలి చాలా సేపు అలాగే కదలకుండా ఉండిపోయింది. దాన్ని చూసి సమీప ప్రాంతాల వారు భయపడ్డారు. బుధవారం(సెప్టెంబర్ 16,2020) నగరంలో భారీ వర్షం కురిసింది. ఆ వరదకు మొసలి అక్కడికి కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
మొసలి కదలికలను తొలుత స్థానికులు గుర్తించారు. ముందు షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత అమ్మో మొసలి అని భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే విషయాన్ని పోలీసులకు, జూ సిబ్బందికి తెలిపారు. రంగంలోకి దిగిన జూ సిబ్బంది పురానాపూల్ వంతెన దగ్గరికి చేరుకుంది. మొసలిని పట్టుకొని తరలించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే అది నీటిలోకి వెళ్లిపోయింది. సిబ్బంది దాన్ని గుర్తించి, పట్టుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నారు.
https://10tv.in/thick-clouds-of-mosquitoes-from-hurricane-laura-kill-cows-deer-and-other-livestock-in-louisiana-by-draining-their-blood/
బుధవారం హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. 10 సెంటీమీటర్లకు పైగా వాన పడింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వాన నగరాన్ని ముంచెత్తింది. రహదారులన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.