Cyclone Montha: హనుమకొండలో వరద బీభత్సం.. ఇళ్లలోకి చేరిన నీరు.. సాయం కోసం బాధితుల వేడుకోలు..
జేసీబీలు, తాళ్ల సాయంతో బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
Cyclone Montha: వరంగల్ నగరంలోని హనుమకొండలో వరద బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో స్థానికులకు ప్రాణభయం పట్టుకుంది. సాయం కోసం ఆర్తనాదాలు పెట్టారు. వెంటనే పోలీసులు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. జేసీబీలు, తాళ్ల సాయంతో బాధితులను రక్షించేందుకు రెస్క్యూ చేశారు. రామకృష్ణ, రెవెన్యూ కాలనీలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అటు భారీ వర్షాల నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 08457 230000 నెంబర్ కి కాల్ చేయాలని సూచించారు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టర్ హైమావతి. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు కలెక్టర్. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు.
మరోసారి తెరుచుకున్న నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ..
అటు భారీ వర్షాల నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద పెరిగింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 310.8498 టీఎంసీలు. న్ ఫ్లో 39,707 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 65,077 క్యూసెక్కులు.
