Cyclone Montha : షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మొంథా తుపాను.. అంచనాలు తారుమారు.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు అతిభారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Cyclone Montha : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. అయినా ఏపీలోని పలు జిల్లాలకు ముప్పు పొంచిఉంది.. ఇవాళ సాయంత్రం వరకు ..
Cyclone Montha
Cyclone Montha : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి 11.30 నుంచి 12:30 గంటల సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎంఏ) ప్రకటించింది. తీరందాటినప్పటికీ మొంథా ఇంకా తీవ్ర తుపానుగానే కొనసాగుతోందని.. బుధవారం మధ్యాహ్నంకు తుపానుగా మారి.. బుధవారం సాయంత్రంకు వాయుగుండంగా బలహీన పడుతుందని, ఈ క్రమంలో ఇవాళ పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మొంథా తుపాను మొత్తం మూడు సార్లు దిశ మార్చుకుంది. రాత్రి 10 గంటల సమయంలో మూడోసారి దిశ మార్చుకొని.. ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అప్పటివరకూ ఉన్న అంచనాలు కూడా తప్పేలా చేసింది. చివరకు అది అంతర్వేది కింద నుంచి.. రాత్రి 11.30 తరువాత తీరం దాటింది. శాటిలైట్ లైవ్ మ్యాపింగ్ ప్రకారం.. తుపాను ఖచ్చితంగా అంతర్వేదికి దక్షిణంగా కాళీపట్నం దగ్గర తీరం దాటింది. ఆ తర్వాత భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాకలంక, ఏలూరు, బాపులపాడువైపు వెళ్లింది. అయితే, ఈ తుపాను దిశ మార్చుకోవడానికి ప్రధాన కారణం.. ఏపీ భౌగోళిక విధానమే అనుకోవచ్చు. భూమికి దగ్గరయ్యే సమయంలో.. సముద్ర లోతు తగ్గుతుంది. దాంతో.. సుడి తిరిగే విధానంలో మార్పులొస్తాయి. రాత్రి 10 గంటల సమయంలో అదే జరిగింది. అప్పటివరకూ గుండ్రంగా ఉన్న సుడి.. ఒక్కసారిగా దీర్ఘ చతురస్రాకారంలోకి మారింది. దాంతో దాని దిశ మారిపోయింది. ఆ తర్వాత మళ్లీ సుడి గుండ్రంగా ఏర్పడి.. చివరకు అంతర్వేదికి దక్షిణంగా తీరం దాటినట్లైంది.
మొంథా తుపాను కారణంగా ఇవాళ (బుధవారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్టణం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా.. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
బుధవారం సాయంత్రం వరకు ఏపీలో భారీ స్థాయిలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మచిలీపట్నం – దివిసీమ – కృష్ణా – పశ్చిమ గోదావరి – కోనసీమ – బాపట్ల బెల్ట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురడంతోపాటు.. 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
విజయవాడ – గుంటూరు – అమరావతి ప్రాంతంలో భారీ వర్షాలకుతోడు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో 80 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజమండ్రి – కాకినాడ – అమలాపురం – ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు. విశాఖపట్టణం, శ్రీకాకుళం – విజయనగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తుపాను ప్రభావంతో భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా వర్షాల సమయంలో బయటకు రావొద్దని సూచించారు. ఒకవేళ అత్యవసరమై బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.
భారీ స్థాయిలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో .. చెట్ల కింద ఉండొద్దు. విద్యుత్ స్థంభాలను దగ్గరగా.. విద్యుత్ వైర్ల కింద ఉండొద్దు. హోర్డింగ్ లు, ప్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఉండొద్దు. భారీ వర్షాల నేపథ్యంలో పాడుబడిన, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.
