ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టింది : భట్టి విక్రమార్క
మేము కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకం. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా తన పాత్ర పోషించిందా.. అనే విషయాన్ని ముందుగా ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలి.

Telangana Deputy CM Bhatti Vikramarka
Mallu Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు. ప్రభుత్వ వైఫల్యం ఏంటో కేటీఆర్ చెప్పాలని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం ప్రభుత్వ వైఫల్యమా? రైతు రుణమాఫీ చేయడం ప్రభుత్వ వైఫల్యమా? ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వ వైఫల్యమా? అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. మీరు అధికారం కోల్పోయినప్పుడల్లా అమాయక ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఫార్మా క్లస్టర్స్ విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కు పని అంటూ బీఆర్ఎస్ నేతల తీరుపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేము కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకం. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా తన పాత్ర పోషించిందా.. అనే విషయాన్ని ముందుగా ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలి. అలాకాకుండా ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టిందంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుల గణనపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్కీములు పెరగడానికే కుల గణన చేస్తున్నామని చెప్పారు. కుల గణన చేస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాటను చేసి చూపిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధికి కుల గణన ఎంతగానో ఉపయోగపడుతుందని భట్టి పేర్కొన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతుంది. కుల గణన సర్వేలో అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే ప్రశ్నలు తయారు చేశాం. కుల గణన విప్లవాత్మక నిర్ణయం అని భట్టి అన్నారు.