Telangana Assembly 2023 : రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది : భట్టి విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న ఆర్థిక పరిస్థితిపై దద్దరిల్లిన సభ ఈరోజు విద్యుత్ రంగంపై చర్చ చేపట్టింది. దీంట్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు.

White Paper released On Power Sector : అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేశారు. నిన్న ఆర్థిక పరిస్థితిపై దద్దరిల్లిన సభ ఈరోజు విద్యుత్ రంగంపై చర్చ చేపట్టింది. దీంట్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రాష్ట్ర ఆర్థిక పురోగతిలోను..రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగ పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్ సరఫరాయే వెన్నెముక అని అన్నారు. వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా..రవాణా,సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యం అని అన్నారు.
రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్తే మొత్తంగా చూస్తే, ఆర్థిక పరంగా, నిర్వహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండడం రాష్ట్ర మనుగడకు చాలా అవసరమన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి టిఎస్ జెన్‌కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగావాట్లు, రాష్ట్రం ఏర్పాటుకంటే చాలా ముందుగానే తెలంగాణలో 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు, పనులు అప్పటి మా ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తరువాతి కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. ముఖ్యంగా..రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని..ఇక్కడి స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యానికి అదనంగా 1800 మెగావాట్ల విద్యుత్ వచ్చే విధంగా కూడా అప్పటి మా ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు చట్టంలో రూపొందించడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసినది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మాత్రమేనని..ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావడానికి సుదీర్ఘ కాలం పట్టిందని వెల్లడించారు. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వలన పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరిగిపోయిందని అన్నారు. మరొక ప్రాజెక్టు, బొగ్గు గనులకు అత్యంత దూరంగా నిర్మాణంలో వున్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వ్యయమే సంవత్సరానికి రూ 800 కోట్లు, ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్ళు అనుకుంటే, ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతున్నదని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకర స్థితిలో ఆందోళనకరంగా వున్నదని..డిస్కంలు ఇప్పటిదాకా మూటగట్టుకున్న నష్టాల మొత్తం రూ 62,461 కోట్లు. 31 అక్టోబర్ 2023 నాటికి అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఈ అప్పుల మొత్తంలో రూ 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం అని అన్నారు. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ 28,673 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించవలసి వుందన్నారు.
విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణమని..రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ 28,842 కోట్ల బకాయిలు..ఈ మొత్తం బకాయిలలో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు రూ 14,193 కోట్లు..ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ వాస్తవ సర్దుబాటు ఖర్చుల (ట్రూ అప్) కింద గత ప్రభుత్వం డిస్కం లకు చెల్లిస్తానని మాట తప్పిన రూ 14,928 కోట్ల భారం డిస్కంల ఆర్థిక స్థితిని మరింత కుంగదీశాయన్నారు.
ఈ పరిస్థితులలో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కం లు అలవికాని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయని..విద్యుత్ కొనుగోళ్ళకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవడం చాలా కష్టమని అన్నారు. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం వలన, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వలన ఇవాళ డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి వున్నాయని ఆరోపించారు. విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వలన ఆర్ధికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుండి వారసత్వంగా పొందినప్పటికీ, రాష్ట్రం లోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్తును బాధ్యతాయుతమైన, పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి వున్నదని అన్నారు.
రాష్ట్ర విద్యుత్ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక పరమైన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, గత ప్రభుత్వం మా ప్రభుత్వానికి అనేక సమస్యలతో వదిలివేసిన విద్యుత్ సంస్థల ప్రస్తుత స్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా పైన వుందని అన్నారు. అందుకే..రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులను..ఆ తరువాత దాదాపు పదేళ్ల పాటు గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలను నిర్వహించిన తీరును..ఆర్థికంగా నష్టాలలోకి నెట్టిన తీరును ఈ శ్వేత పత్రం ద్వారా వివరించే ప్రయత్నం చేసామని భట్టి వివరించారు. తద్వారా..ఒక అర్ధవంతమైన చర్చ జరిగి, విద్యుత్ రంగం విషయంలో భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యల గురించి కొన్ని విలువైన సలహాలు సూచనలు ఇస్తారని ఈ ప్రభుత్వం ఆశిస్తున్నదని కోరారు.