Nirudyoga March: ఆ మంత్రి గుండెల్లో గుబులు.. అందుకే పరుగున యూనివర్సిటీకి వెళ్లారు: డీకే అరుణ

DK Aruna
Nirudyoga March: మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కేంద్రంలో బీజేపీ ఇవాళ నిరుద్యోగ మిలియన్ మార్చ్ (Nirudyoga March) నిర్వహించింది. క్లాక్ టవర్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీకే అరుణ (DK Aruna) మాట్లాడుతూ.. “తెలంగాణ వస్తే పాలమూరును సస్యశ్యామలం చేస్తారని అనుకుంటే కేసీఆర్ ఇక్కడి ప్రజలను నట్టేట ముంచారు. నిరుద్యోగ మార్చ్ ఉంటుందని తెలిసి జిల్లాలోని ఓ మంత్రి గుండెల్లో గుబులుతో పరుగున వెళ్లి పాలమూరు యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి. తెలంగాణ వచ్చాక పాలమూరులో ఎలాంటి అభివృద్ధీ జరుగలేదు. తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు నిరుద్యోగుల ఉసురు తగులుతుంది. అబద్ధాలు చెప్పడంలో తండ్రిని మించిపోయారు కేటీఆర్.
మోసాలు చేయడంలో తండ్రీకొడుకులు డాక్టరేట్ సాధించారు. దుబాయ్ శేఖర్ నీవు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు. నిన్ను గద్దె దించే శక్తి బీజేపీకి ఉంది. ఆ పేరు నీకెందుకు వచ్చిందో తెలుసుకో. నీ దగ్గర ఉన్న డబ్బులు నీ సొంతం కాదు.. అది ప్రజల సొత్తు” అని అన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ… “పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని కేసీఆర్ మనందరిని మోసం చేసి ఓట్లు వేసుకుని పాలమూరును మరిచారు. నిరుద్యోగులంతా రోడ్లపై తిరుగుతున్నా ఫ్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే నీళ్లు తెస్తానని జిల్లా ప్రజలను మోసం చేశారు. జిల్లాలో ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.
బీఆర్ఎస్ ఆరాచకాలు పెరిగిపోతున్నాయి. పాలమూరు బిడ్డలు బీఆర్ఎస్ పార్టీని గద్దె దించుతారు. రాష్ట్రంలో ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దళిత ముఖ్యమంత్రిని చేసే ధైర్యం కేసీఆర్ కు ఉందా? ప్రపంచం మొత్తానికి మోదీ ఆదర్శవంతం. మాయ మాటలతో దోపిడీ చేస్తున్న కేసీఆర్ కుటుంబం అంతం అవుతుంది” అని చెప్పారు.