EC-Kavitha TRS : కవిత పార్టీకి బిగ్ షాకిచ్చిన ఈసీ.. టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే ..
EC- Kavitha TRS Party : కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) బిగ్ షాకిచ్చింది. ఆమె ఏర్పాటు చేసిన కొత్త పార్టీకి టీఆర్ఎస్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. అయితే, అందుకు కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది.
EC Directs Kalvakuntla Kavitha TRS Name Change
Election Commission – Kavitha TRS : కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) బిగ్ షాకిచ్చింది. ఆమె గత కొద్ది నెలల క్రితం తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పేరుతో ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో కవితకు ఎన్నికల సంఘం బిగ్ షాకిచ్చింది. కవిత ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ పేరు మార్చుకోవాలని సూచించింది.
కల్వకుంట్ల కవిత నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీకి టీఆర్ఎస్గా నామకరణం చేసి.. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, టీఆర్ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీ మూలాలతో ముడిపడి ఉన్న టీఆర్ఎస్ పేరును ఎట్టి పరిస్థితుల్లో కవిత పార్టీకి రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు చేశారు. ఇందుకు అనుమతి ఇస్తే.. ఓటర్లలో తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ పేరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారికంగా కవితకు లేఖ రాశారు.
పార్టీ పేరు మార్పునకు సంబంధించి కవితకు 15రోజుల వరకు ఈసీ గడువు ఇచ్చింది. ఆలోపు మూడు ప్రత్నామ్నాయ పేర్లను తమకు సమర్పించాలని కవిత పంపిన లేఖలో ఈసీ పేర్కొంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా కొత్త పేర్లను ప్రతిపాదించకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తి క్లోజ్ చేస్తామని ఈసీ హెచ్చరించినట్లు తెలిసింది.
కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ పంపిన లేఖలో కీలక విషయాలను ప్రస్తావించింది. రెండు పార్టీల అభ్యంతరాలను ఈసీ జత చేసింది. తెలంగాణ రాజ్య సమితిపై షోలాపూర్ కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ పేరుపై చాలా అభ్యంతరాలు వచ్చాయని ఈసీ తెలిపింది. అయితే, వ్యక్తిగత అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవద్దని కవిత కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు సమాచారం. టీఆర్ఎస్ పేరును వదిలే ప్రసక్తే లేదని కవిత పేర్కొంటున్నట్లు సమాచారం.
