Harish Rao: కేటీఆర్ వ్యక్తి కాదు శక్తి.. టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ భస్మం అవుతుంది- హరీశ్ రావు

తప్పులు, అరాచకాలు ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ఏమీ అవ్వదన్నారు.

Harish Rao: కేటీఆర్ వ్యక్తి కాదు శక్తి.. టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ భస్మం అవుతుంది- హరీశ్ రావు

Harish Rao

Updated On : June 16, 2025 / 10:11 PM IST

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. సీఎం రేవంత్ కి పాలన చేతగాక కేటీఆర్ పై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ పై 18 నెలల్లో 14 కేసులు పెట్టారని చెప్పారు. వద్దన్నా అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువు తీసిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని కేటీఆర్, బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అసలు కేసే లేదన్నారు. తప్పులు, అరాచకాలు ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ఏమీ అవ్వదన్నారు. కేటీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పారు. కేటీఆర్ తో పాటు లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారన్న హరీశ్ రావు.. కేటీఆర్ ను ముట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ భస్మం అవుతుందని హెచ్చరించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో రైతాంగానికి మేలు జరుగుతోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతో బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆమె మండిపడ్డారు. కేసీఆర్, హరీశ్, కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. కక్షతో కేటీఆర్ మీద కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారని సబిత మండిపడ్డారు.

కేటీఆర్ మీద కేసు పెట్టడం కాదు.. ఎన్నికల ప్రచారం గ్యారంటీ కార్డు చూపిస్తూ ఓట్లు వేయించుకుని మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల మీద కేసు పెట్టాలని అన్నారు. మహిళలకు ఉచిత బస్ ఒక్కటే చేశారని, అదే మహిళలకు 2వేల 500 వేయలేదని, 4 వేలు ఫించన్లు ఇయ్యలేదని సబిత అన్నారు.

Also Read: నన్ను అరెస్ట్ చేసుకోండి.. ఒకటే ప్రశ్న తిప్పితిప్పి అడిగారు.. ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం రేవంత్ పాలనలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయం అన్నారు. 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈనెల 18న హెల్త్ సెక్రటరీ, డీఎంఇ NMC ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని తాఖీదులు ఇవ్వడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అన్నారు. ఇంత ముఖ్యమైన విషయంపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం రేవంత్.. ఈరోజు కమిటీ వేయడం హాస్యాస్పదమన్నారు.

పరిపాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు భరోసా? అని ప్రశ్నించారు. మీ పరిపాలన వైఫల్యం మెడికల్ విద్యార్థులకు శాపంగా మారుతోందన్నారు. NMC రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖను మీకు పంపిస్తున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 26 మెడికల్ కాలేజీల భవితవ్యాన్ని కాపాడండి అని చెప్పారు. తక్షణమే మెడికల్ కాలేజీలకు కావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో శ్రమించి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే విద్యార్థులు జీవితాలను నిలబెట్టండని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు హరీశ్ రావు.