KTR: 2014లోనే జీవన్ రెడ్డిని ఆహ్వానించాం.. బీఆర్ఎస్లో సముచిత స్థానం కల్పిస్తాం- కేటీఆర్
తాను ఎన్టీఆర్, చెన్నారెడ్డి, వైస్సార్, కోట్ల, చంద్రబాబులాంటి సీఎంలను చూశానని చెప్పారు. వారందరి కంటే బెటర్ పాలన కేసీఆర్ ది అని పొగిడారు.
KTR: తెలంగాణ వచ్చాక 2014 లోనే జీవన్ ని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే, తాను కాంగ్రెస్ సభ్యుడిని అని, పార్టీ మారేది లేదని నాడు జీవన్ రెడ్డి సున్నితంగా చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్, జీవన్ రెడ్డిలది నాలుగు దశాబ్దాల స్నేహ బంధం అని తెలిపారు. కేసీఆర్ సీఎం హోదాలో కరీంనగర్ వచ్చాక మైక్ తొలుత జీవన్ కి ఇచ్చారని చెప్పారు. ఒక చిన్న బ్రిడ్జ్ కావాలని జీవన్ రెడ్డి అడిగితే అక్కడికక్కడే బోర్నపల్లి వంతెన మంజూరు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై జీవన్ రెడ్డికి పట్టుదల ఉందన్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు కేటీఆర్. జీవన్ రెడ్డితో మాట్లాడిన కేటీఆర్ ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని.. కేసీఆర్, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళను అవమానపరుస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. జీవన్ రెడ్డి రెండు మూడు రోజుల్లో కేసీఆర్ ని కలుస్తామని అన్నారని తెలిపారు. ప్రజలు, పాలన బాగుపడాలి అంటే జీవన్ రెడ్డి లాంటి వారి సహకారం అవసరమన్నారు. బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డికి సముచిత స్థానం ఉంటుందని కేటీఆర్ హమీ ఇచ్చారు.
నేను చూసిన ముఖ్యమంత్రుల్లో ద బెస్ట్ కేసీఆరే- జీవన్ రెడ్డి
పదేళ్ల కాలంలో కేసీఆర్ అనేక పనులు చేశారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తాను ఎన్టీఆర్, చెన్నారెడ్డి, వైస్సార్, కోట్ల, చంద్రబాబులాంటి సీఎంలను చూశానని చెప్పారు. వారందరి కంటే బెటర్ పాలన కేసీఆర్ ది అని పొగిడారు. పదేళ్ల కేసీఆర్ పాలన తర్వాత రెండేళ్లలో తిరోగమన పాలన రేవంత్ రెడ్డిది అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలు ఉన్నాయన్నారు. వ్యక్తిగతంగా మానసిక క్షోభతో పాటు రాష్ట్ర ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ను వీడానని వెల్లడించారు. తాను రాజకీయాల్లో చివరి దశలో ఉన్నానని, ఒక ఎన్నిక చూస్తాను కావచ్చని, ఈ చివరి దశలో కేసీఆర్ తో జ్ఞాపకాలు నెమరేసుకుంటానని జీవన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.
